Modugunta Lake: స్వేచ్ఛ బ్యూరో: మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోదుగుంట చెరువు భూముల పరిరక్షణపై ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్, ఉమ్మడి పురుషోత్తం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కలిసి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాకు వినతిపత్రం సమర్పించారు. వారి ప్రకారం, చెరువు శిఖం మరియు ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలోని భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. సర్వే నంబర్లు 294, 292, 296, 298, 2975 పరిధిలో సుమారు 40.2 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సి ఉన్న చెరువు ప్రస్తుతం కేవలం ఐదు ఎకరాలకు పరిమితమైందని వివరించారు.
గతంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి నీటిపారుదల శాఖకు భూముల బదిలీ సమయంలో రికార్డులు తారుమారైనట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు పట్టాదారులు కోర్టుల ద్వారా తమకు అనుకూలంగా తీర్పులు పొందినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా, చెరువు మధ్యలో రహదారి నిర్మాణం కోసం మట్టి నింపడంతో అది రెండు భాగాలుగా విడిపోయిందని తెలిపారు. చెరువు శిఖం ప్రాంతంలో గతంలో నిర్మించిన ఒక ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ప్రస్తుతం షాపింగ్ మాల్ నిర్మాణం కొనసాగుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువు శిఖం మరియు బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలు నిషేధమైనప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
Also Read: దిమ్మతిరిగేలా విజయ్ ఆస్తులు.. భార్య పేరు మీద ఎన్ని కోట్లు ఉన్నాయంటే?
గతంలో ,ప్రస్తుతం కూడా కొంతమంది తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని (ఇక్కడ ఏ రాజకీయ పార్టీని ప్రస్తావించడం లేదు) ప్రభావశీలులు కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి పట్టాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్న నిర్మాణాలపై కూడా సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి చెరువు భూములను రక్షించాలని కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, జిల్లా కేంద్రంలోని చెరువుల పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Also Read: అర్థరాత్రి వరకే డెడ్ లైన్.. ఇప్పటికే 80 ప్రాపర్టీలు సీజ్ చేసిన అధికారులు