Marriage Scams: స్వేచ్ఛ బ్యూరో: పెళ్లి పేర యువతులను ఉచ్ఛులోకి లాగుతున్న క్రిమినల్స్ నయా మోసాలకు పాల్పడుతున్నారు. మొదట సాన్నిహిత్యం పెంచుకుని ఆ తరువాత బ్లాక్ మెయిలింగ్ చేస్తూ అందిన కాడికి డబ్బు గుంజుతున్నారు. ఇటీవలిగా షీ టీమ్స్ కు ఈ తరహా ఫిర్యాదులు అధికంగా వస్తున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ సూచించారు. అదే సమయంలో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మ్యాట్రిమోనియల్ సైట్లను ఉపయోగించుకుంటూ క్రిమినల్స్ చేస్తున్న మోసాలు తరచూ వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.
ప్రొఫైల్ లో ఆకర్షణీయమైన ఫోటో పెట్టి తమను తాము సంపన్న వ్యాపారులుగా, ఎన్ఆర్ఐలుగా పేర్కొంటున్న నేరగాళ్లు యువతులు, మహిళలను వలలోకి లాగుతున్నారు. ఆసక్తి చూపించి ఎవరైనా కాంటాక్ట్ చేస్తే తరచూ వారితో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ కొన్ని రోజుల్లోనే సన్నిహితమవుతున్నారు. ఆ తరువాత అర్జంటుగా డబ్బు అవసరం పడిందనో.. పోలీసులు బ్యాంక్ ఖాతాలన్నింటినీ ఫ్రీజ్ చేశారనో నమ్మించి లక్షలకు లక్షలు గుంజుతున్నారు. కొన్నిరోజుల క్రితం జూబ్లీహిల్స్ లో ఉంటున్న ఓ వైద్యురాలిని ఇదే విధంగా మోసం చేసిన వ్యక్తి లక్షల రూపాయలు కొల్లగొట్టాడు. ఇచ్చిన డబ్బు వాపసు చేయమని అడిగితే నీ పర్సనల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Srikakulam: కలవరపెడుతున్న డయేరియా.. అనారోగ్యం కోరల్లో శ్రీకాకుళం వాడలు!
మరికొందరు ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం సంప్రదాయబద్ధంగా సంపన్న కుటుంబాల్లోని యువతులను పెళ్లి చూపులు చూస్తున్నారు. పిల్ల నచ్చిందంటూ నిశ్చితార్థం చేసుకుంటున్నారు. దీనికి ముందు తమను తాము కోటీశ్వరులమని, ఫలానా వ్యాపారాలు ఉన్నాయని నమ్మిస్తున్నారు. ఇక, నిశ్చితార్థం కాగానే పెళ్లి ఖాయమయ్యింది కదా అని యువతులకు దగ్గరవుతున్నారు. రేపోమాపో వివాహం చేసుకుంటున్నాం తప్పేం లేదని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ శారీరకంగా సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. కోరిక తీరిన తరువాత అసలు రంగు బయట పెడుతున్నారు. నీతో పెళ్లి పీటలు ఎక్కాలంటే భారీగా డబ్బు ఇవ్వాల్సిందే అంటూ షరతు పెడుతున్నారు. లేనిపక్షంలో పెళ్లిని రద్దు చేసుకుంటామని బెదిరిస్తున్నారు. నిశ్చితార్థం సమయంలోనే పెళ్లి ఖాయమైందన్న విషయం బంధుమిత్రులు అందరికీ తెలిసిపోతున్న నేపథ్యంలో వివాహం ఆగిపోతే పరువు పోతుందని భయపడుతున్న బాధితురాళ్లు వారి తల్లిదండ్రులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం కూడా చేయలేక పోతున్నారు. అదే అవకాశంగా మోసగాళ్లు మరింత ఒత్తిడి పెంచి డబ్బు వసూలు చేస్తున్నారు.
ఇలాంటి వారి బారిన పడి మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే మార్గమని కమిషనర్ సజ్జనార్ చెప్పారు. మ్యాట్రిమోనియల్ సైట్లు చూసి పెళ్లికి సిద్ధపడకూడదన్నారు. అదే సమయంలో పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మేయ వద్దని సూచించారు. అవతలి వ్యక్తి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై పెళ్లికి ముందే క్షుణ్నంగా తనిఖీ చేసుకోవాలని చెప్పారు. నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరిగే వరకు అప్రమత్తంగానే ఉండాలన్నారు. వివాహానికి ముందు ఏకాంతంగా కలవటానికి శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా అనుమానించాలని చెప్పారు. ఇలాంటి ప్రతిపాదనలను ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరించాలన్నారు. డబ్బు డిమాండ్ చేసినా బ్లాక్ మెయిల్ చేసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డయల్ 100కు కూడా ఫోన్ చేసి కంప్లయింట్ ఇవ్వొచ్చని చెప్పారు. బాధితురాళ్ల వివరాలను గోప్యంగా పెడతామని తెలిపారు.
Also Read: ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బిగ్ అప్డేట్.. అధికారుల తర్జన భర్జన..?