Fire Accident: ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతుండటం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. నిత్యం ఏదొక ప్రదేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాతబస్తీ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్‌లో నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గోడౌన్ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోకుండా వేగంగా స్పందించడంతో పెద్ద ఎత్తున నష్టం తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.
అలీనగర్ కాలాపత్తార్ ప్రాంతంలో ఉన్న ఈ గోడౌన్‌లో భారీగా ప్లాస్టిక్ స్క్రాప్, వ్యర్థాల నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే ఖచ్చితమైన కారణం వెల్లడిస్తామని తెలిపారు.
గోడౌన్‌కు ఆనుకుని నివాస గృహాలు ఎక్కువగా ఉండటంతో.. మంటలు వ్యాప్తి చెందుతాయేమోనన్న భయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే సమయంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి.
ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని పోలీసులు స్పష్టం చేశారు. గోడౌన్‌లో ఆ సమయంలో కార్మికులు లేని కారణంగా ప్రాణనష్టం తప్పింది. అయితే గోడౌన్‌లో నిల్వ ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ కొంత మేర దగ్ధమై ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.
Also Read: నడి రోడ్డుపై గుర్రపు స్వారి.. రాజేంద్ర నగర్‌లో చప్రీగాళ్ల పిల్ల చేష్టలు, వీడియో వైరల్
ప్లాస్టిక్ గోడౌన్ల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అనుమతి, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయా లేదా అన్న అంశాలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. గోడౌన్ యజమానిని విచారించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.