Ignite Scam Busted: డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేర వేలాది మందిని ఉచ్ఛులోకి లాగి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సంస్థ ‘క్యూనెట్’. బాధితుల ఫిర్యాదు మేరకు కొంతకాలం క్రితం హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసి క్యూనెట్ లోని కీలక నిందితులను అరెస్ట్ చేశారు. అయితే అదే సంస్థ తాజాగా ఇగ్నైట్ గా పేరు మార్చుకుని దేశవ్యాప్తంగా రూ. 5 వేల కోట్లను కొల్లగొట్టటానికి కుట్ర చేసింది. 18 రోజుల క్రితం మోసాలు మొదలు పెట్టింది. ఇది గుర్తించిన హైదరాబాద్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు రంగంలోకి దిగి ఇగ్నైట్ సంస్థకు చెందిన ఆరుగురు కీలక నిందితులను కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సంజీవరెడ్డినగర్ స్టేషన్ పరిధిలో ఉంటున్న ఓ వ్యక్తిని ఇటీవల ఆఫ్రికా నెంబర్ తో వాట్సాప్ ద్వారా సంప్రదించిన మిస్టస్ సెసే అనే వ్యక్తి.. తాను క్యూనెట్ నుంచి ఇగ్నైట్ కు మారినట్టు చెప్పాడు. తాము ఇచ్చే ఉత్పత్తులను డైరెక్ట్ సెల్లింగ్.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా అమ్మితే కొన్నిరోజుల్లోనే లక్షలు సంపాదించవచ్చని నమ్మించాడు. ఆ తరువాత రూ. 61వేలను వసూలు చేశాడు. పంజాగుట్ట స్టేషన్ పరిధిలోనూ మరో వ్యక్తిని ఇలాగే మోసం చేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా ఆయా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
'ఇగ్నైట్' లాంటి మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో చేరితే.. చట్టవిరుద్ధమైన వ్యాపారంలో భాగస్వాములైనట్లే లెక్క!
తెలిసి కూడా ఇతరులను ఇందులో చేర్పిస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పైస్థాయి వారికి చేరవేస్తే, నిషేధిత స్కీమ్‌లో పాల్గొన్న నేరానికి మీరే బాధ్యులు కావాల్సి ఉంటుంది.… https://t.co/ierREQMZ6f pic.twitter.com/2GSzo4XZY2
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 11, 2026
ఈ మూడు కేసులు హైదరాబాద్ ఆర్థిక నేరాల వింగ్ అధికారుల దృష్టికి వచ్చాయి. అనుమానంతో ఆరా తీయగా ముగ్గురు బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బు ఇగ్నైట్ నెట్ వర్క్ కు చెందిన పారస్ నాథ్ మర్కంటైల్, ఇండీ కనెక్ట్ వెంచర్స్ ఖాతాలోకి వెళ్లినట్టుగా నిర్ధారణ అయ్యింది. మరింత లోతుగా దర్యాప్తు చేయగా 18 రోజుల క్రితమై మొదలైన ఇగ్నైట్ సంస్థ దేశవ్యాప్తంగా జనాన్ని కొల్లగొట్టటానికి పథకం వేసినట్టుగా తెలిసింది.
దాంతో దర్యాప్తులో వేగం పెంచిన అధికారులు ఇగ్నైట్ సంస్థలో టీమ్ లీడర్, రిక్రూటర్, జూమ్ ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్న నొయిడా వాస్తవ్యుడు ఒనియల్ గుప్తాను అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇండీ కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు డైరెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ సాహిల్, కో డైరెక్టర్‌గా ఉన్న ప్రియాన్షు సక్సేనా, పారస్ నాథ్ మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్లుగా ఉన్న కోల్ కతాకు చెందిన ప్రవీణ్ కుమార్ దకాలియా, పరితోష్ కుమార్ దకాలియా, ఫీల్డ్ రిక్రూటర్ గా వ్యవహరిస్తున్న కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన రియాజ్ లను అరెస్ట్ చేశారు.
నిందితులను జరిపిన విచారణలో ఇగ్నైట్ సంస్థ హాంకాంగ్ కేంద్రంగా నడుస్తున్న మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ అని వెల్లడైంది. ఈ ముఠా వ్యవస్థాపకుడైన పత్మన్ సేనాథిరాజా ముంబై ఈవోడబ్ల్యు నమోదు చేసిన 425 కోట్ల కుంభకోణం, తమిళనాడులో నమోదైన గోల్డ్ క్వెస్ట్ కేసుల్లో నిందితునిగా ఉన్నాడు. ప్రస్తుతం హంకాంగ్ లో ఉంటూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.
ఇక, ఇగ్నైట్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న అడ్లీ హసన్ గతంలో క్యూనెట్ సంస్థ తరపున మోసాలు సాగించి అత్యధికంగా డబ్బు కొల్లగొట్టిన వ్యక్తి. మన దేశంలో ఇగ్నైట్ పేర మోసాలు చేసేందుకు ఇండి కనెక్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. అయితే సంస్థను ఏర్పాటు చేసిన 18 రోజులకే దానిపై మొదటి ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే ఆర్థిక నేరాల విభాగం అధికారులు రంగంలోకి దిగి కీలక నిందితులను అరెస్ట్ చేశారు. తద్వారా దేశవ్యాప్తంగా రూ.5వేల కోట్లు కొల్లగొట్టాలన్న ఇగ్నైట్ సంస్థకు 18 రోజుల్లోనే చెక్ పెట్టారు.
Also Read: Wi-Fi లేకుండానే వాడేసుకోవచ్చా? శాంసంగ్ సరికొత్త 5G రగ్గడ్ ట్యాబ్ ప్రత్యేకతలివే!