Bear Rolls Royce Insurance| టెక్నాలజీని ఉపయోగించి మోసాలు చేయడంలో కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. సామాన్యులు, పేదవారు డబ్బు కోసం మోసం చేస్తే అర్థముంది కానీ కోట్లు ఆస్తి ఉన్నవారు కూడా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఒక ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగింది. కోట్ల విలువ గల లగ్జరీ కారుపై ఎలుగుబంటి దాడి చేసిందని కారణం ఆధారాలు చూపుతూ కారు ఓనర్ ఇన్షూరెన్స్ కంపెనీ నుంచి రూ.1 కోటి 20 లక్షలు క్లెయిమ్ చేశాడు. అయితే అందులో మోసం ఉందని ఇన్షూరెన్స్ కంపెనీ విచారణ అధికారులు పసిగట్టారు.
వివరాల్లోకి వెళితే.. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఒక వ్యక్తి రెండేళ్ల క్రితం రోల్స్ రాయ్స్ ఝోస్ట్ 2010 మోడల్ లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు. ఆ కారు విలువ దాదాపు రూ.7 కోట్లు. అయితే జనవరి 2024లో ఆ లగ్జరీ కారుపై ఎలుగుబంటి దాడి చేసి.. దాన్ని నాశనం చేసిందని సిసిటీవి వీడియో ఆధారంగా చూపుతూ.. కారు యజమాని ఇన్షురెన్స్ కంపెనీలో దావా వేశాడు. కారు భాగాలు నాశనమయ్యాయని… అందుకుగాను రూ.1 కోటి 20 లక్షలు (దాదాపు) క్లెయిమ్ చేశాడు.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
కానీ ఇన్షూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చేస్తే.. వాటిని పరిశీలించే ప్రక్రియ పాటిస్తుంది. పైగా క్లెయిమ్ రూ. కోటికి పైగా ఉండడంతో పోలీసులు, విచారణ అధికారులు కూడా ఘటన ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తారు. ఈ క్రమంలో ఇన్షూరెన్స్ కంపెనీ విచారణ అధికారులు.. ఎలుగుబంటి కారుపై దాడి చేసిందంటే నమ్మలేదు. అందుకే కారు ఓనర్ సమర్పించిన సిసిటీవి వీడియోలను పరిశీలించారు. అందులో ఎలుగుబంటి కదలికలు అనుమాస్పదంగా కనిపించాయి. పైగా కారులోపల ఎలుగుబంటి గోర్లతో దాడి చేసిన గుర్తులు చూసి.. అవి సహజంగా లేవని తెలిపారు. ఏదో తేడా ఉందని గమనించారు.
అందుకే కాలిఫోర్నియా వైల్డలైఫ్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసే బయోలిజిస్ట్ ని పిలిచి ఆ సిసిటీవి వీడియో, కారులో ఎలుగుబంటి చేసిన గుర్తులను చూపించారు. అమెరికాలో అడవుల్లో ముఖ్యంగా క్యాలిఫోర్నియాలో భారీ ఆకారంలో ఉండే బ్రౌన్ బేర్స్ (ఎలుగుబంట్లు) సంఖ్య చాలా ఎక్కువ. అప్పుడప్పుడూ అవి మనుషులపై హింసాత్మక దాడులు చేసిన ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. దీంతో ఆ జంతువుల గురించి బాగా అనుభవమున్న బయోలిజిస్ట్ ఆ వీడియోలు చూసి అందులో ఉన్నది అసలు ఎలుగుబంటి కాదని చెప్పాడు. వీడియోలో కనిపించే జంతువు శరీరంపై ఉన్న వెంట్రుకలు చాలా మెరిసిపోతున్నాయని.. సహజంగా ఎలుగుబంటి శరీరంపై ఉండే వెంట్రుకలు అలా ఉండవని చెప్పాడు.
ఆ తరువాత కారు సీట్ల ఎలుగుబంటి గోరు గుర్తులు చూసి.. అవి నిటారుగా పారెలెల్ గా ఉన్నాయని ఎలుగుబంటి పంజా అలా ఉండదని అభిప్రాయపడ్డాడు. వీడియోలో కనిపిస్తున్న ఎలుగుబంటి కదలికలు చూస్తుంటే అది ఎవరో ఎలుగుబంటి వేషం ధరించిన మనిషి అని చెప్పాడు. దీంతో ఇన్షూరెన్స్ అధికారులు కారు ఓనర్ ని పోలీసులు సాయంతో అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. తనకు, తన స్నేహితులకు డబ్బు అవసరం ఉండడంతో ఎలుగుబంటిలా తన స్నేహితుడు వేషం వేసుకొని ఆ దాడి చేశాడని చెప్పాడు.
దీంతో పోలీసులు కారు ఓనర్ ముగ్గురు స్నేహితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరి ఇంట్లో ఎలుగుబంటి డ్రెస్, ఇనుప గోర్లు కూడా లభించాయి. ఆ నలుగురిపై ఫ్రాడ్ కేసు నమోదు అయింది.