Hide And Seek Crime| ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులిద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే కోపతాపాలు మళ్లీ ఆవిరైపోతాయి. కానీ కొన్నిసార్లు ఉన్మాదంలో ప్రేమికులు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటిదే ఒక ఘటన జరిగింది. ప్రేమికులిద్దరూ దాగుడు మూతలు ఆడుతూ ఉండగా.. ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితురాలు చెబుతూ ఉండగా.. పోలీసులు మాత్రం ఆమె ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేసిందని అనుమానంతో అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే అమెరికాలో ఫ్లోరిడా నగరంలో నివసించే సారా అనే 47 ఏళ్ల మహిళ జార్జి అనే 42 యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో 2020 సంవత్సరంలో ఒక రోజు రాత్రి ఇద్దరూ మద్యం సేవించి దాగుడు మూతలు ఆడారు. ఇలా వారిద్దరూ తరుచూ చేసేవారు.
ఆటలో భాగంగా జార్జ్ ఒక పెద్ద సూట్ కేసులో దాక్కున్నాడు. అయితే ఇదంతా చూసిన సారా అతడు లోపల ఉండగానే సూట్ కేసుకు బయటి నుంచి జిప్ తో లాక్ చేసింది. దీంతో జార్జి తనకు ఊపిరి ఆడడం లేదని ఎంతో అరిచాడు. కానీ సారా మద్యం మత్తులో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లి.. తన బెడ్ రూమ్ లో నిద్రపోయింది. అయితే ప్రేమికులిద్దరూ ఇంట్లో తరుచూ వీడియోలు రికార్డ్ చేసేవారు. అలా ఈ ఘటన కూడా వీడియో రికార్డ్ అయింది. అయితే మరుసటి రోజు సారా నిద్రలేచి చూసేసరికి జార్జి సూట్ కేసులో చనిపోయి ఉన్నాడు.
Also Read: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం
జరిగిన ఘటన గురించి సారా పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జార్జి శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ తరువాత సారా ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో జార్జి శవంపై గాయాలున్నట్లు తేలింది. చనిపోయేముందు జార్జి వీపు చేతులు, కాళ్లపై బలంగా దెబ్బల తగిలాయని.. ఎవరో అతడిని చితకబాది సూట్ కేసులో బంధించి ఉంటారని పోస్ట్ మార్టం చేసిన వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సారాని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు. కానీ ఆమె నోరు మెదపలేదు. ఇదంతా ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని పదే పదే చెప్పింది.
దీంతో పోలీసులు ఆమె ఇంటిని సోదా చేశారు. అక్కడ పోలీసులకు వీడియో రికార్డింగ్స్ లభించాయి. అందులో జార్జిని సారా చిత్రహింసలకు గురి చేసేదని తేలింది. జార్జి మరణించే రోజు కూడా జార్జి తనకు ఊపిరి ఆడడం లేదని వెంటనే సూట్ కేసు తెరవాలని సారాను వేడుకుంటున్నట్లు వీడియోలో ఉంది. అయినా సారా మాత్రం కనికరం లేకుండా నవ్వుతూ.. జరగాల్సిందే అని చెప్పి వెళ్లిపోయినట్లు వీడియోలో స్పష్టంగా ఉన్నట్లు కోర్టులో న్యాయమూర్తి గమనించారు. మిగతా వీడియోల్లో కూడా జార్జిని సారా హింసిస్తున్నట్లు ఉండడంతో న్యాయమూర్తి ఆమెను దోషిగా తేల్చారు. ఈ కేసు విచారణ ఇటీవలే ముగిసింది. అయితే తీర్పుని డిసెంబర్ 2 కు కోర్టు వాయిదా వేసింది. జార్జి హత్య కేసులో సారా కనీసం జీవితకాలం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది మీడియాకు తెలిపారు.