Delhi ISIS Attack Foiled: దిల్లీలో దీపావళి నాడు ఐసిస్ మద్దతుదారుల భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. దక్షిణ దిల్లీలోని ఓ మాల్, పబ్లిక్ పార్క్‌తో సహా రద్దీ ప్రాంతాల్లో దాడి చేసేందుకు ప్లాన్ చేసిన ఇద్దరు ఐసిస్ మద్దతుదారులను చేశామని దిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు.
దిల్లీ, భోపాల్‌లో నిర్వహించిన ఆపరేషన్లలో అద్నాన్ అనే పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు దిల్లీలోని సాదిక్ నగర్‌కు చెందినవాడు కాగా, మరొకరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చెందినవాడు. ఈ అరెస్టులు దిల్లీలో ఉగ్ర కుట్రను నివారించాయని అదనపు పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) ప్రమోద్ కుష్వాహా తెలిపారు. ఐసిస్ మద్దతుదారులు దక్షిణ దిల్లీలోని ఒక మాల్, పార్క్‌తో సహా అనేక రద్దీ ప్రదేశాలలో రెక్కీ చేశారని తెలిపారు. ఈ ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేశారన్నారు.
దీపావళి వేడుకల సమయంలో రద్దీగా ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని, ఎక్కువ ప్రాణనష్టం కలిగించడమే లక్ష్యంగా దాడులు ప్లాన్ చేశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. దిల్లీలోని పలు ప్రాంతాల ఫొటోలు,ఐసిస్ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర నేర సంబంధిత వస్తువులు, వీరిద్దరికీ విదేశీ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. అలాగే వీరిద్దరూ ఐఈడీ దాడికి సిద్ధమయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి.
నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అదనపు కమిషనర్ ప్రమోద్ కుష్వాహా, ఏసీపీ లలిత్ మోహన్ నేగి నేతృత్వంలోని బృందాలు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ఇద్దరు నిందితులకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాక్ ఐఎస్ఐ ఐసిస్ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుల నెట్‌వర్క్, అంతర్జాతీయ సంబంధాలను ఆరా తీస్తున్నామన్నారు.
వీరిద్దరూ ఆన్‌లైన్‌లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విదేశాలలోని హ్యాండ్లర్ల నుంచి మద్దతు పొంది ఉండవచ్చని స్పెషల్ సెల్ పోలీసులు భావిస్తున్నారు. నిందితులు భారీ దాడికి సిద్ధమయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ అరెస్టులు పండుగ సీజన్‌లో భారీ ఉగ్రవాద దాడిని నివారించాయని పోలీసులు తెలిపారు.
Also Read: Crime News: బలవంతంగా నాలుగు సార్లు రేప్ చేసిన ఎస్ఐ.. సూసైడ్ నోట్ రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య
ఈ ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని, ఈ నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను గుర్తించడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రమోద్ కుష్వాహా తెలిపారు. ఈ ఇద్దరితో సంబంధం ఉన్న వారి కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు.