Kurnool Bus Accident: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనం అయ్యాయి. ప్రమాద స్థలాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాలతో కలిసి హోంమంత్రి అనిత పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు అవసరమైతే ఘటనాస్థలంలోనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని హోంమంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని తెలిపారు .
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రైవేట్ బస్సు ప్రమాద బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. ప్రమాదం జరిగిన విధానంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి క్షతగాత్రులకు అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హోం మంత్రి అనిత ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారన్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు, కర్ణాటక, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారని తెలిపారు. ఇంకొకరి మృతదేహం గుర్తించాల్సి ఉందన్నారు. కర్నూలులో మంత్రులు వంగలపూడి అనిత, రాం ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
“బస్సులో మొత్తం 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులు, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. ప్రమాదం నుంచి ఇద్దరు బస్సు డ్రైవర్లు సహా 27 మంది బయటపడ్డారు. వీరిలో 12 మంది స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాం” అని హోంమంత్రి అనిత అన్నారు.
మంటలు చెలరేగి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయని హోంమంత్రి అనిత తెలిపారు. మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఈ ఘటనపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రమాదానికి కారణాలు అన్వేషించేందుకు మరో 4 బృందాలు, రసాయన విశ్లేషణ కోసం 2 బృందాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రయాణికుల జాబితా.. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్‌కు కాల్ చేయండి
బస్సు ప్రమాద మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారన్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించి, వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని హోంమంత్రి తెలిపారు.