Kurnool Bus Accident: కర్నూలు జిల్లా చిన్నటేకూరులో ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన బస్సును తొలగిస్తుండగా మరో ప్రమాదం జరిగింది. బస్సును తొలగిస్తు్న్న క్రేన్ బోల్తా పడింది. ఈ ఘటనలో క్రేన్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు, సహాయక సిబ్బంది అతడిని రక్షించారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. బైకును ఢీ కొని మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనం అయ్యారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో భద్రతాలోపాలు బయటపడ్డాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు సీటింగ్ క్యారియరే కానీ స్లీపర్ సర్వీస్ కాదని తేలింది. వేమూరి కావేరి ట్రావెల్స్.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో టూరిస్టు పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదు చేసుకున్నారు.
తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సంస్థ ఈ బస్సును 2018లో కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. అనంతరం వేమూరి వినోద్ కుమార్ కొనుగోలు చేసి ఎన్వోసీ తీసుకుని డయ్యూ డామన్‌లో మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కష్టమని డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఈ సంస్థ కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉండగా.. డయ్యూ డామన్‌లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నారు. ఒడిశా రాయగడలో ఆల్ట్రేషన్, ఫిట్‌నెస్ చేయించుకుని ఆర్టీఓ అనుమతి తీసుకున్నారు.
రాయగడ అధికారులు ఈ బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ వేమూరి కావేరి ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్‌గా ఆల్ట్రేషన్ చేసింది. డయ్యూ డామన్‌లో సీటింగ్ సామర్థ్యంతో బస్సు రవాణా పన్ను ఒక్క సీటుకు రూ.450 కాగా, స్లీపర్ సీటు అయితే రూ.800 పన్ను చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటుకు రూ.4500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే స్లీపర్ క్యారియర్ అయితే ఒక్క సీటుకు రూ.12 వేల చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్‌లు ఎగవేసేందుకే వేమూరి కావేరి ట్రావెల్స్ సంస్థ ఇతర రాష్ట్రాల్లో అక్రమ రిజిస్ట్రేషన్, ఆల్ట్రేషన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతుంది.
Also Read: Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికులు వీళ్లే