Crime News: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సతారా జిల్లా ఫల్టాన్‌లో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. ఓ పోలీస్ అధికారి నుంచి తీవ్రమైన వేధింపులు ఎదురవ్వడంతో 28 ఏళ్ల ఆ డాక్టర్ గురువారం రాత్రి ఒక హోటల్ గదిలో ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన పోలీస్ అధికారి పేరును ఆమె తన అరచేతిపై సూసైడ్ నోట్‌గా రాసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది.
ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్ ఫల్టాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేవారు. ఆమె తన అరచేతిపై రాసిన నోట్‌లో, ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ బద్నే తన చావుకు ప్రధాన కారణమని స్పష్టంగా పేర్కొంది. తనను మానసికంగా శారీరకంగా వేధించాడని.. గత నాలుగు-ఐదు నెలల్లో నాలుగు నుంచి ఐదు సార్లు అత్యాచారం చేశాడని ఆమె సంచలన ఆరోపణలు చేేసింది. లైంగిక వేధింపులతో పాటు మరో పోలీస్ అధికారి ప్రశాంత్ బంకర్ కూడా తనను మానసికంగా వేధించాడని లేఖలో వెల్లడించింది
ఈ తీవ్రమైన ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే సతారా ఎస్సీతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ గోపాల్ బద్నేతో సహా మరో అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై అత్యాచారం (IPC సెక్షన్ 376), ఆత్మహత్యకు ప్రేరేపించడం (IPC సెక్షన్ 306) సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ALSO READ: Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికులు వీళ్లే
బాధితురాలు గతంలోనే తనపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి స్థానిక డిఎస్పీకి లేఖ రాసినట్టు సమాచారం. దీనిపై ఎందుకు చర్య తీసుకోలేదనే కోణంలో కూడా విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛీఫ్ రూపాలీ చకంకర్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీడ్ జిల్లాకు చెందిన ఆ మహిళా డాక్టర్ మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం నివేదికను మార్చేందుకు పోలీసులు రాజకీయ ఒత్తిడి పెడుతున్నారని డాక్టర్ బంధువులు ఆరోపించడం ఈ కేసును మరింత జటిలం చేసింది. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది.
ALSO READ: Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. బయటపడ్డ సంచలన వీడియో