Wife Kills Husband: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం భర్త చేసే వేధింపులు భరించలేక.. చివరకు భార్యనే భర్తను కత్తితో హతమార్చిన ఘటన అందరినీ కలచివేసింది.
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య – రాజు దంపతులు గత కొంతకాలంగా తరచూ గొడవపడుతుండేవారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మల్లయ్య నిత్యం భార్యతో అవమానకరంగా మాట్లాడడం, చిన్నచిన్న విషయాలకే గొడవలకు దిగడం అలవాటుగా మారిపోయింది.
అయితే ఇటీవలి కాలంలో వేధింపులు మరింత అధికమయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మాటల తూటాలతోనే కాకుండా కొన్ని సందర్భాల్లో భయభ్రాంతులకు గురిచేసే రీతిలో ప్రవర్తించడంతో.. ఆమె మానసికంగా పూర్తిగా కుంగిపోయినట్టు సమాచారం. ఎన్నోసార్లు పెద్దల సమక్షంలో కూడా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయట. కానీ మల్లయ్య తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో పరిస్థితి మరింత విషమించిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. మాటలు మరింత ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారని తెలుస్తోంది. తీవ్ర ఆవేదనకు లోనైన భార్య రాజు నిద్రిస్తున్న మల్లయ్యను దిండుతో నొక్కి.. ఆ తర్వాత కత్తితో మెడపై దాడి చేసి హత్య చేసింది. తీవ్ర రక్తస్రావంతో మల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, మల్లయ్య అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటన అనంతరం రాజు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. జరిగిన విషయాన్ని వివరంగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. సంఘటనకు కుటుంబ కలహాలే ప్రధాన కారణమని ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అయ్యప్ప స్వాముులు మృతి
మల్లయ్య నిత్యం ఏదో ఒక కారణంతో రాజును దూషిస్తూ మానసికంగా వేధించేవాడట. ఎన్నిసార్లు చెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, ఆ వేధింపులు భరించలేక చివరకు రాజు ఈ ఘోరానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.