Kalwakurthy murder: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఓ ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రిని రక్తపు మడుగులో ముంచి కడతేర్చిన కసాయి కొడుకు కథ వింటే గుండె పగిలిపోతుంది. గురువారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
కల్వకుర్తి పట్టణానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన కుమారుడు బీరయ్యతో ఏదో విషయంలో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కోపానికి చేరి బీరయ్య తండ్రిని కర్రతో తలపై బాదేశాడు. ఒక్క దెబ్బకే బాలయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తన తండ్రి ప్రాణాలు పోయాయని గమనించిన బీరయ్య, అతని మృతదేహాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు.
తండ్రి మృతదేహాన్ని ఇంట్లో ఉంచితే నిజం బయటికొచ్చిపోతుందనే భయంతో బీరయ్య మరింత దారుణంగా వ్యవహరించాడు. ఇంట్లో చనిపోయిన తండ్రిని కారు డిక్కీలో పెట్టుకుని సమీపంలోని దిండి చింతపల్లి వాగు వైపు వెళ్లాడు. అక్కడ మృతదేహాన్ని వాగులో పడేసి ఎవరూ చూడలేదని అనుకుని తిరిగి వచ్చేశాడు. కానీ కొద్దిసేపటికే గ్రామస్తుల అనుమానం మేల్కొంది. తండ్రి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆరా తీయగా, బీరయ్య వ్యవహారంలో అనుమానాస్పద కోణాలు బయటపడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. దర్యాప్తులో బీరయ్యే తన తండ్రి హత్యకు పాల్పడినట్టు తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. బీరయ్య ఎందుకు తన తండ్రిని హత్య చేశాడు? ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Also Read: Karimnagar News: కరీంనగర్‌లో బుర్ఖా డ్రామా.. మెడికల్ కాలేజీలో కలకలం!
ఇక మృతదేహం కోసం పోలీసులు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. దిండి చింతపల్లి వాగు పరిసర ప్రాంతాలను సోదా చేస్తున్నారు. వాగులో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహం వెతికే ప్రక్రియ కష్టతరంగా మారింది. స్థానికులు కూడా పోలీసులకు సహకరిస్తూ వాగు చుట్టుపక్కల గాలింపు చేస్తున్నారు. గ్రామస్తులు ఈ ఘటన విని షాక్‌కు గురయ్యారు.
తండ్రిని కనీసం తండ్రిగా భావించని కొడుకు ఇలా ప్రాణాలు తీయడం ఎలా సాధ్యం అవుతుందో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు. తండ్రి, కొడుకుల మధ్య ఏవైనా ఆస్తి వివాదాలు లేదా ఇతర కుటుంబ సమస్యలు హత్యకు దారితీసాయేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కల్వకుర్తి పట్టణాన్ని మాత్రమే కాకుండా మొత్తం నాగర్‌కర్నూల్ జిల్లాన్నే కలచివేసింది. సాధారణంగా కుటుంబ కలహాలు తగాదాల దాకా మాత్రమే ఉండేవి. కానీ తండ్రిని కర్రతో కొట్టి హతమార్చి, మృతదేహాన్ని వాగులో పడేయడం ఎంతటి క్రూరత్వమో చెప్పలేని పరిస్థితి.
ప్రస్తుతం బీరయ్యను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని కనుగొనడానికి ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. తండ్రిని హత్య చేసిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అసలు కారణాలను త్వరలో వెలుగులోకి తీసుకురానున్నారు.