Kanpur twin daughters murder: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రే కాలయముడిగా మారి, తన 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోరం నగరంలో కలకలం సృష్టించింది. నిందితుడిని పోలీసులు ఘటనా స్థలంలోనే అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి భార్య రేష్మా ఛెత్రి తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. 2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దికాలానికే బంధంలో చీలికలు వచ్చాయి. భర్త తాగుడుకు బానిస కావడమే కాకుండా, తనను తీవ్రంగా కొడుతూ, భోజనం కూడా పెట్టకుండా వేధించేవాడని ఆమె వాపోయింది. భార్యపై నిఘా ఉంచేందుకు తన గదిలో సహా ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను అమర్చాడని ఆమె వెల్లడించింది. తల్లిగారింటికి వెళ్లాలని ప్రయత్నిస్తే హింసించేవాడని, కొడుకుని తీసుకుని వెళ్ళిపోవాలని, కూతుళ్లను మాత్రం తన దగ్గరే ఉంచుకుంటానని పదేపదే బెదిరించేవాడని ఆమె కన్నీటిపర్యంతమైంది.
భర్త వేధింపులు భరించలేక తొమ్మిది నెలల క్రితం తన కొడుకును తీసుకుని రేష్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ తన కవల కుమార్తెలపై బెంగతో మళ్ళీ భర్త దగ్గరకు తిరిగి వచ్చింది. నిందితుడు తరచూ తాను ఆత్మహత్య చేసుకుంటానని, తనతో పాటు కూతుళ్లను కూడా చంపేస్తానని బెదిరించేవాడని ఆమె తెలిపింది. శనివారం రాత్రి అందరూ కలిసి భోజనం చేశారని, ఆ తర్వాత తన గదిలోకి కూతుళ్లను తీసుకువెళ్లి పడుకోబెట్టాడని, అప్పటివరకు అంతా సాధారణంగానే ఉందని ఆమె గుర్తు చేసుకుంది.
ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో భర్త ఫోన్‌లో చాలాసేపు మాట్లాడాడని, ఆ తర్వాత ఒక కుమార్తెను బాత్‌రూమ్‌కు తీసుకువెళ్లి తిరిగి గదిలోకి వచ్చాడని రేష్మ సీసీటీవీ మానిటర్‌లో చూసింది. ఆ వెంటనే అతను గదిలో లైట్లు ఆర్పేశాడని, ఆ తర్వాత ఎలాంటి శబ్దం రాకపోవడంతో అందరూ నిద్రపోయారని తాను భావించినట్లు ఆమె చెప్పింది. కానీ ఆ సమయంలోనే అతను తన కన్నకూతుళ్లను గొంతు కోసి చంపేస్తాడని తాను ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడం గమనార్హం.
సమాచారం అందుకున్న సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఇద్దరు బాలికల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీనియర్ పోలీస్ అధికారి దీపేంద్ర నాథ్ చౌదరి మాట్లాడుతూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలను విచారిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు.
Read Also: మేడ్చల్లో దారుణం.. ఈతకు వెళ్లి చిన్నారులు మృతి!