Karnataka cylinder blast : ఆ అవ్వా తాతల జీవితం చివరి దశకు వచ్చింది. వాళ్లు చేయాల్సిన బాధ్యతలన్నీ నెరవేర్చారు.. కానీ విధి మాత్రం వారిపై ఓ మనువరాలి బరువును మోపింది. అయినా.. ఆ కష్టాల జీవితంలో ఆమెకు ఓ దారి చూపుదామనే ఆలోచనతో ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. వారి చివరి మజిలీలో తమపై ఆధారపడిన తమ మనుమరాలికి ఓ జీవితాన్ని చూపించి.. ఇన్నాళ్ల బాధ్యతల్ని పక్కన పెడదాం అనుకున్నారు. ఇన్నాళ్లు కంటికి రెప్పగా కాపాడుకున్న బిడ్డ పెళ్లికి రూపాయి, రూపాయి కూడబెట్టుకుని జాగ్రత్తగా దాచుకున్నారు. అంతలోనే కాలం మరోమారు వారికి పరీక్ష పెట్టింది. చివరి దశలోనూ.. సంతోషాన్ని పొందే వీలులేదంటూ.. అగ్ని ప్రమాద రూపంలో ఎదురైంది. ఉన్న చిన్నపాటి పూరి గుడిసే, మనుమరాలి పెళ్లికి దాచుకున్న కొద్దిపాటి డబ్బుల్ని అగ్ని కీలల్లో కాల్చేసింది. ఈ దశలో ఆ వృద్ధ దంపతుల ఆవేదన చూస్తే.. ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
సత్యసాయి జిల్లాకు మడకశిర సరిహద్దులోని కర్ణాటకకు చెందిన పావగఢ్ లోని హరిహరపుర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఊరిలో ఎప్పుడో కట్టుకున్న పూరి గుడిసెలో దొడ్డణ్ణ, భూతమ్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. చుట్టూ భవంతులు ఏర్పడినా, అందరూ అంతస్తులు కట్టేసుకున్నా.. ఆ వృద్ధ దంపతులు మాత్రం ఉన్నదాంట్లో సర్దుకుపోతూ కుటుంబ భారాన్ని ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. చివరి దశలో వారికి వారే భారంగా మారిన వేళ.. ఓ మనుమరాలి బాధ్యతా వారి పైనే పడింది. అయినా.. వారు ఆమెను చదివించారు. తమలాంటి కష్టాలు నీకు వద్దు బిడ్డా అంటూ ఉన్నంతలో విద్యాబుద్ధులు నేర్పించారు.
వారి నీడన బతుకుతున్న ఆడపిల్లకు ఆసరాగా ఉండేందుకు అన్నీ చేశారు.. దొడ్డణ్ణ, భూతమ్మ. తాము ముద్దుగా పెంచుకున్న మనుమరాలికి పెళ్లి చేయాలనే ఆలోచనతో.. కాస్త బంగారాన్ని కూడబెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసం కొంత డబ్బుల్ని పొదుపుగా దాచుకున్నారు. అమ్మాయికి చదువు ఉండడంతో చిన్నపాటి ఉద్యోగంలో చేరుతుందిలే అనే భరోసాలో ఉన్నారు. ఆమె జీవనానికి చిన్నపాటి ఉపాధి పొందుతుందిలే అని ఆశించారు. కానీ.. గ్యాస్ సిలిండర్ రూపంలో వారి జీవితాలు తారుమారైయ్యాయి.
పూరి గుడిసెలో వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. పెద్ద శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో.. ఇంట్లోని వృద్ధ దంపతులు దొడ్డణ్ణ, భూతమ్మ.. వారి మనుమరాలు తిప్పమ్మ బయటకు పరుగులు తీశారు. ప్రాణాలతో బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. వెనక్కి తిరిగి చూస్తే వారి గూడు కాలిపోయింది. ఇన్నాళ్లు ఆసరాగా ఉన్న నీడ దూరమైంది. దాంతో.. గుండెలు బరువెక్కేలా ఏడవటమే వారి వంతైంది.
గ్రామంలోని దళితవాడలో ఈ ఘటన చోటు చేసుకోగా.. స్థానికులంతా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పటికే గుడిసె మొత్తం కాలిపోవడంతో అంతా నిస్సహాయంగా నిలుచుండిపోయారు. ఈ అగ్నిప్రమాదంలో మనుమరాలు తిప్పమ్మ పెళ్లి కోసం తెచ్చుకున్న నగలు, ఆమె చదువుకుని సంపాదించుకున్న సర్టిఫికేట్లు అన్నీ అగ్నికి ఆహుతి అయిపోయాయి. పెళ్లి ఖర్చుల కోసం రూపాయి రూపాయి కూడబెట్టిన రూ.50 వేల సొమ్ములు సైతం కాలిపోయాయి. మంటలు ఆర్పే శక్తి లేక, పోయిన సొమ్ముల్ని తిరిగి కూడబెట్టుకుంటాములే అనే ధీమా లేక దీనంగా నిలుచుకున్న వారి పరిస్థితి అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
Also Read : గర్భవతిని పొడిచేసిన పిజ్జా డెలివరీ వర్కర్.. చిల్లర కోసం గొడవ!
గుడిసె మొత్తం ఆనవాళ్లు లేకుండా కాలిపోయింది. ఇందులోని కొద్దిపాటి సామానులతో పాటు నిత్యావసరాలు, సరిఫికెట్లు, దుస్తులు మొత్తం కాలి బూడిదయ్యాయి. దాంతో.. ఈ వృద్ధ దంపతులు, పెళ్లీడుకొచ్చిన మనుమరాలితో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా నిలుచున్నారు.