Krishna District Tragedy : సరదాగా తల్లి కొంగు పట్టుకొని.. కాలువ దగ్గరకు వెళ్లిన చిన్నారులు ఇక తిరిగి రాలేదు. కళ్ళముందే నీటితో ఆడుకుంటూ సంతోషించిన చిందించిన పిల్లలు.. క్షణాల్లోనే కనిపించకుండా పోయారు. పారే నీటిలో అప్పటి వరకు చిరునవ్వుల చిందించిన.. చిన్నారులు ఆ నీటిలోనే మునిగి ఆర్ధనాథాలు పెట్టారు. కృష్ణ జిల్లాలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల మృతి.. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
ఊరు పక్క నుంచి పారే కాలువ. పుష్కలంగా నీళ్లు.. సాధారణంగా అలాంటి చోట బట్టలు ఉతకడానికి ఆడవాళ్లు వెళుతూ ఉంటారు. అలానే ఆ ఊరి మహిళలు సైతం బట్టలు తీసుకొని పారే కాలువ దగ్గరికి వెళ్తున్నారు. తల్లులు వెంట మేము వస్తామంటూ మారాం చేశారు.. వారి పిల్లలు. సరేలే చిన్నారులు ఆడుకుంటారు కదా.. అనే ఉద్దేశంతో తల్లులు కూడా తలుపారు. అదే వారి జీవితాల్లో విశాదానికి కారణమైంది. సరదాగా గడుపుతారని తీసుకెళ్లిన పిల్లలు.. ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లుల గుండె కోత కన్నీళ్లు పెట్టిస్తోంది.
కృష్ణాజిల్లా అగిరిపల్లె మండలానికి చెందిన సీతారాంపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లులతో పాటు సరదాగా ఈతకు వెళ్లిన పిల్లలు.. నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. అప్పటి వరకు నీటిలో అల్లరి చేస్తూ తిరిగిన చిన్నారులు.. ఆ నీటి ప్రవాహానికే కాలువలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు తల్లులు ప్రయత్నించినా కాలువ వేగానికి వీలు కాలేదు. దాంతో ఇద్దరు చిన్నారులు సీతారాంపురంలోని ఏలూరు కాలవలో కొట్టుకుని పోయారు.
ఇద్దరు పిల్లల గల్లంతు విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు రెడ్డి అజయ్ కోలా, యశ్వంత్ కృష్ణా లుగా వీరవల్లి పోలీసులు తెలిపారు. చిన్నారుల మృతిదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read : భర్త వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్ వెళితే ఎస్సై వేధింపులు.. రాజకొండ సీపీపి మహిళ ఫిర్యాదు
ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. తల్లిదండ్రులకు సూచనలు చేశారు. పారే కాలువల్లో అజాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చిన్నారులను వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి ప్రవాహాన్ని మారుతుంటుంది కాబట్టి.. కాలువలోకి దిగేందుకు అనుమతించవద్దని కోరుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరదలు, రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసే సందర్భాలలో.. ఒక్కసారిగా ప్రవాహాలు పెరుగుతాయని, కాబట్టి.. చిన్నారులను కాలువల్లోకి దించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు