KitKat Heist: టెక్నాలజీ రోజులు వచ్చినా దొంగతనాలు తగ్గలేదు. కాకపోతే చేసే విధానం మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన కిట్‌క్యాట్ చాక్లెట్ సంస్థ దొంగలు షాక్ ఇచ్చారు. దాదాపు రూ.1.5 కోట్లన్నర విలువ చేసే చాక్లెట్ కంటెయినర్‌ని హైజాక్ చేశారు. ఈ ఘటన తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది నెస్‌లే సంస్థ. చివరకు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహాయం కోరింది.
యూరప్‌లో దొంగతనం.. ఏకంగా కిట్‌క్యాట్ కంటైనర్ చోరీ
యూరప్‌లో ఊహించని రోబరీ చోటు చేసుకుంది. ప్రముఖ బ్రాండ్ నెస్లేకు చెందిన కిట్‌క్యాట్ చాక్లెట్ల కంటెయినర్ అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. అందులో దాదాపు 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లు ఉన్నాయి. ఈ ఘటన గురించి తెలియగానే ఒక్కసారిగా ఆ కంపెనీ షాకైంది. దీన్ని పెద్ద దోపిడీగా వర్ణించింది. ఈ వ్యవహారం మార్కెట్‌లో తీవ్ర కలకలం రేపింది.
గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మీడియా సమాచారం మేరకు కంటెయినర్ ట్రక్కు ఇటలీ నుంచి పోలాండ్‌కు భారీ సరుకుతో బయలు దేరింది. అందులో దాదాపుగా 4,13,000 యూనిట్ల కిట్ క్యాట్ చాక్లెట్లు ఉన్నాయి. మరి ఏం జరిగిందో తెలీదుగానీ మార్గమధ్యంలోనే కంటెయినర్ అదృశ్యమైంది.
షాకైన తయారీ సంస్థ.. సరుకు విలువ దాదాపు కోటిన్నర పైగానే
కంటెయినర్ సరకు యూరప్‌లోని వివిధ దేశాలకు వెళ్లాల్సివుంది. అయితే అది గమ్యస్థానానికి చేరలేకపోవడంతో తయారీ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈస్టర్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆ కంపెనీకి పెద్ద దెబ్బగా చెబుతున్నారు. ఎందుకంటే ఈస్టర్ పండుగ వేళ యూరప్‌లో ఈ చాక్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్ని గమనించిన రోబరీ గ్యాంగ్ ఈ విధంగా చేసి ఉంటుందని ఓ అంచనా.
కంటెయినర్ చోరీ నేపథ్యంలో సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ కంపెనీ భావిస్తోంది. కిట్‌క్యాట్ చాక్లెట్ల కొరతకు దారి తీయవచ్చని చెబుతోంది. దొంగిలించబడిన సరుకును బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తారేమోనన్న టెన్షన్ వెంటాడుతోంది. చోరీ జరిగిన తీరు ఓ సినిమాను తలపిస్తోంది.
దొంగలు నకిలీ రవాణా పత్రాలు, ఫేక్ ఐడెంటిటీ కార్డులను క్రియేట్ చేశారట. డ్రైవర్ యూనిట్‌కు చేరకుముందే పక్కా ప్రణాళికతో ఆ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. సిబ్బందిని తమ మాటలతో నమ్మించి కిట్‌క్యాట్ చాక్లెట్లతో నిండిన భారీ కంటెయినర్‌ని అక్కడి నుంచి తీసుకుని ఉడాయించారు. ఇటలీ సరిహద్దు దాటిన కాసేపటికి ట్రక్కు జీపీఎస్ పని చేయలేదు. సిగ్నల్స్ నిలిపివేయడానికి హైటెక్ జామర్లను ఉపయోగించినట్టు పోలీసుల అనుమానం.
ALSO READ: వాడొక విచిత్ర దొంగ.. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? తెలుస్తే షాకవుతారు
కంటెయినర్ ట్రక్కుతోపాటు చాక్లెట్ల లోడ్ కనిపించలేదు. ఎలక్ట్రానిక్స్ వంటి ఖరీదైన వస్తువులను లక్ష్యంగా చేసుకునే అంతర్జాతీయ ముఠాలు దోపిడీకి తెగబడుతుంటాయి. ఏకంగా చాక్లెట్లపై పడటం ఆందోళన కలిగించే అంశం. పోలీసులు-లాజిస్టిక్స్ భాగస్వాములు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
రిటైలర్లు, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని తయారీ సంస్థ కోరింది. ప్రతి చాక్లెట్‌కు ప్రత్యేకమైన కోడ్ ఉంటుందని, అది స్కాన్ చేయడం ద్వారా దొంగిలించబడిన వస్తువా కాదా? అనేది తెలుసుకోవచ్చని చెబుతోంది. కిట్ క్యాట్‌తో కాస్త విరామం తీసుకోమని ఎల్లప్పుడూ ప్రకటన వస్తుంది. బహుశా దొంగలు ఈ నినాదాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.