Donald Trump: అమెరికా రాజకీయ వేదికపై డొనాల్డ్ ట్రంప్ పేరు ఓ సంచలనం. ఆయన నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయో, అంతే వేగంగా వివాదాస్పదమవుతుంటాయ్ కూడా! వీటన్నింటిని ఇన్నాళ్లూ భరించిన అమెరికా ప్రజలు.. ఇప్పుడు భరించలేకపోతున్నారు. అందుకే.. అమెరికా వీధుల్లోనూ, ఐరో దేశాల్లోని ప్రధాన నగరాల్లోనూ.. నో కింగ్స్ అనే నినాదం మార్మోగుతోంది. ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో.. రాజులు వద్దు అనే నినాదం రావడం వెనుక లోతైన కారణాలు, అనేక రాజకీయ పరిణామాలు ఉన్నాయ్.
అమెరికా అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు ఉండొద్దనేదే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశ్యం. ట్రంప్ రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అధ్యక్షుడిలా.. ఆయన్ని ఓ అధ్యక్షుడిలా కాకుండా, రాజులా కనిపించేలా చేస్తున్నాయనే వాదన వినిపిస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇరాన్‌పై యుద్ధం, వెనెజుయెలా అధ్యక్షుడిని తీసుకొచ్చేయడం, కఠిన వలస విధానాలు, అడ్డగోలు టారిఫ్‌లు, ఇలా అనేక విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
ఇప్పుడు ఏకంగా అమెరికాతో పాటు ఐరోపాలోని ప్రధాన నగరాల్లో.. నో కింగ్స్ పేరుతో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా 3200 నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటిలో.. 90 లక్షల మంది స్వచ్ఛందంగా పాల్గొని.. ట్రంప్ సర్కార్‌పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ లాంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం చేశారు. ఐరోపాలోని లండన్, ప్యారిస్, రోమ్ లాంటి పెద్ద నగరాల్లోనూ ట్రంప్ విధానాలపై ఆందోళనలు చేపట్టారు.
ఈ అంతర్జాతీయ నిరసన ప్రదర్శనలకు.. అమెరికాలోని మిన్నెసోటా స్టేట్ వేదికగా నిలిచింది. లక్షలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. నిరంకుశత్వానికి అమెరికా గడ్డపై చోటు లేదంటూ నినాదాలు చేశారు. పౌరహక్కులు, ఇమ్మిగ్రేషన్, ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళకారులు గళమెత్తారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చోటు చేసుకొన్న అతిపెద్ద ఆందోళనలుగా.. నో కింగ్స్ నిరసనలు నిలిచాయి. ఈ ఆందోళనలు ప్రజాస్వామ్య విలువలకు అద్దంపట్టాయని చెబుతున్నారు. లాస్ ఏంజెలెస్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ దగ్గర భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. డల్లాస్‌లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో కొంత మందిని అరెస్టు చేశారు. మరోవైపు.. రిపబ్లికన్ పార్టీ నేతలు ఈ ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు.
అమెరికాలో మొదలైన నో కింగ్స్ ఉద్యమం.. లండన్, పారిస్, రోమ్ లాంటి నగరాలకు పాకడంపైనే హాట్ డిబేట్ నడుస్తోంది. ట్రంప్ వైఖరి వల్ల నాటో కూటమి బలహీనపడుతోందనే భయం ఐరోపా దేశాల్లో ఉంది. పారిశ్రామిక లాభాలకే ట్రంప్ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు కూడా నిరసనలకు ఆజ్యం పోస్తున్నాయ్. ప్రపంచానికే ప్రజస్వామ్య పాఠాలు నేర్పే అమెరికాలో.. నిరంకుశ పోకడలు కనిపిస్తే, అది తమ దేశాల్లోని మితవాద శక్తులకు ఊతమిస్తుందని అమెరికా, ఐరోపా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఒక సేవకుడు మాత్రమే గానీ రాజు కాదు.
అయితే, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని తీర్పులు ట్రంప్‌కు అపరిమితమైన అధికారాన్ని ఇస్తున్నాయని మేధావులు భావిస్తున్నారు. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదనే మౌలిక సూత్రాన్ని కాపాడటానికే.. ఈ నో కింగ్స్ ఉద్యమం మళ్లీ మొదలైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఏకపక్ష నిర్ణయాలు, ప్రశ్నించే వ్యవస్థలను బలహీనపరచడం లాంటివి.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని నిరసనకారులు వాదిస్తున్నారు. అందువల్ల.. తమకు అధ్యక్షుడే కావాలి గానీ, రాజు కాదనే నినాదం ప్రపంచదేశాల్లో ప్రతిధ్వనిస్తోంది. మరోవైపు.. ట్రంప్ తీసుకుంటున్న అస్థిర నిర్ణయాలు ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తాయోనన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.
ప్రెసిడెంట్ ట్రంప్.. మొదటి నుంచి అమెరికా ఫస్ట్ అనే పాలసీనే నమ్ముతారు. దీనివల్ల.. చైనా, మెక్సికో మాత్రమే కాదు, స్నేహపూర్వక దేశాలపైనా భారీ టారిఫ్‌లు వేశారు. ఇది.. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను తుంగలో తొక్కడమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా దేశంలోకి వచ్చేవారిని అడ్డుకోవడంలో తప్పులేదు. కానీ, మానవతా దృక్పథం లేకుండా కుటుంబాలను విడదీయడం, కఠినమైన బహిష్కరణలు చేపట్టడం లాంటివి అమెరికా ఉదారవాద స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. నేను యుద్ధాలను ఆపుతానని ప్రకటిస్తూనే, ఇరాన్ లాంటి దేశాలతో కయ్యానికి కాలు దువ్వడమేంటనే ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయ్. అమెరికా ప్రయోజనాలకు నేరుగా ముప్పులేకపోయినా, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం సృష్టించడం వల్ల చమురు ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతోంది. ఇవన్నీ చూశాక.. ట్రంప్‌పై తిరుగుబాటు మొదలైంది.
అమెరికా తల్చుకుంటే.. ఇరాన్ లాంటి దేశం యుద్ధాన్ని ఎన్నిరోజులు తట్టుకోగలదు? అనే అంచనాలను తలకిందులు చేస్తూ.. నెల రోజులు గడిచినా ఇంకా పరిస్థితులు కొలిక్కి రాలేదు. నెల రోజులుగా పశ్చిమాసియా యుద్ధ సెగలతో రగిలిపోతోంది. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లు.. ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచను నిలబెట్టాయ్. కేవలం, సైనిక బలంతో ఏ దేశాన్ని పూర్తిగా లొంగదీసుకోలేమని అమెరికాకు మరోసారి అర్థమైంది. ట్రంప్ విదేశాంగ విధానం ఎప్పుడూ ఓ పజిల్‌లాగే ఉంటుంది.
ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం.. అమెరికా మిత్రదేశాలను కూడా అయోమయంలో పడేసింది. ముఖ్యంగా.. యూరోపియన్ దేశాలు ఈ యుద్ధాన్ని సమర్థించకపోవడం ట్రంప్‌కు బిగ్ మైనస్‌గా మారింది. అంతేకాదు, అనవసరమైన యుద్ధాల్లో తలదూర్చకుండా, అమెరికా సమస్యలు, ఆర్థిక వ్యవస్థపైనే దృష్టి పెడతానని ట్రంప్ ప్రామిస్ చేశారు. కానీ, ఇరాన్‌తో యుద్ధం అందుకు విరుద్ధంగా ఉంది. అమెరికా పౌరులు కూడా.. మనకెందుకు పరాయి దేశాల గొడవలు? ముందు మన దేశంపై ఫోకస్ పెట్టండి అని గళం విప్పుతున్నారు.
ఇప్పటికే, అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నవంబర్‌లో మొదట్లోనే ఎన్నికలు జరగనున్నాయ్. ఈ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల నేతలు హోరాహోరీగా తలపడనున్నారు. దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో.. మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయ్. ఎగువ సభ సెనేట్‌లో.. మొత్తం 100 స్థానాల్లో 35 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు 39 రాష్ట్రాలు, టెరిటరీల్లో గవర్నర్ పదవులకు ఎన్నికలు ఉంటాయ్. ట్రంప్ తీరు, నో కింగ్స్ ఉద్యమంతో.. మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. నో కింగ్స్ ర్యాలీలు కేవలం నిరసనగానే కాకుండా, ఓటర్లని సమీకరించే శక్తివంతమైన వేదికగా మారుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఓ రాజులా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ పరిమితులను దాటుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో జనం రోడ్లపైకి రావడం డెమొక్రటిక్ పార్టీకి అనుకూలంగా మారొచ్చంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ట్రంప్ ముందు రెండే మార్గాలున్నాయ్. ఒకటి.. దూకుడు తగ్గించుకోవడం. రెండోది.. అమెరికా వ్యవహారాలపై మాత్రమే ఫోకస్ పెట్టడం. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించి.. ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తూ, దౌత్యపరంగా చర్చలు జరపాలనే సూచనలు వినిపిస్తున్నాయ్. ఇక, తన ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు, బోర్డర్ సెక్టూరిటీ, దేశీయ ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టాలి. చరిత్ర పేజీలను తిరగేస్తే.. వియత్నాం నుంచి అప్ఘానిస్థాన్ వరకు అమెరికా ఎక్కడా చిన్న దేశాలపై పూర్తి స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది.
ఇరాన్ విషయంలోనూ అదే రిపీట్ అవకుండా ఉండాలంటే, మొండితనం వీడి.. తెలివైన దౌత్యనీతిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అయితే, ట్రంప్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ భారీ నిరసనలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇవన్నీ.. లెఫ్టిస్ట్ ఫండింగ్ నెట్‌వర్క్ సృష్టించిన కృత్రిమ నిరసనలని, వీటిక్ ప్రజా మద్దతు లేదంటున్నారు. ఏదేమైనా, నో కింగ్స్ నిరసనలను ట్రంప్ సీరియస్‌గా తీసుకొని దూకుడు తగ్గించుకుంటారా? లేదా? అనేదే ఇంట్రస్టింగ్ పాయింట్.
Story by: Anup, Big Tv