Kukatpally Robbery: స్వేచ్ఛ బ్యూరో: సినీ ఫక్కీలో జరిగి సంచలనం సృష్టించిన కోటి రూపాయల దోపిడీ కేసులోని మిస్టరీని కూకట్ పల్లి పోలీసులు బాలానగర్ సీసీఎస్ అధికారులతో కలిసి ఛేధించారు. గ్యాంగులోని నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 77.39 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కూకట్ పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బహదూర్ పురా చందూలాల్ బారాదరి వాస్తవ్యుడైన మహ్మద్ కుస్రోద్దీన్ (42) వృత్తిరీత్యా ఏసీ టెక్నీషియన్. బహదూర్ పురాలోని సిద్రా ఎంటర్ ప్రైజెస్ లో పని చేస్తున్నాడు. ఇదే సంస్థలో బహదూర్ పురాకు చెందిన మహ్మద్ అజీముద్దీన్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా సిద్రా ఎంటర్ ప్రైజెస్ యజమాని చాలా రోజులుగా హవాలా దందా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో 10 రూపాయల కరెన్సీ నోటును కుస్రోద్దీన్, అజీముద్దీన్ లకు ఇచ్చి తాను చెప్పిన వారిని కలిసి ఆ నోటు చూపించి ఇచ్చిన డబ్బు తీసుకొమ్మని చెప్పేవాడు. ఇలా తీసుకున్న డబ్బును నగరంలోని వేర్వేరు చోట్ల షేక్ ఇబ్రహీం అనే వ్యక్తికి ఇవ్వమని సూచించేవాడు. ఇలా చేతులు మారుతున్న డబ్బు కోట్లలో ఉండటంతో కుస్రోద్దీన్ లో దురాశ పుట్టింది. ఈసారి నగదును తరలించినపుడు సహచరులతో కలిసి దోచుకోవాలని పథకం వేసిన కుస్రోద్దీన్ బహదూర్ పురాకే చెందిన స్నేహితుడు మహ్మద్ ఉమర్ షరీఫ్ (32)కు విషయం చెప్పాడు. ఒకేసారి జాక్ పాట్ కొట్టొచ్చని చెప్పటంతో ఉమర్ షరీఫ్ సహకరించటానికి అంగీకరించాడు. ఇటువంటి పరిస్థితుల్లో సిద్రా ఎంటర్ ప్రైజెస్ యజమాని ఓ 10 రూపాయల నోటును సోమవారం అర్ధరాత్రి సమయంలో కుస్రోద్దీన్, అజీముద్దీన్ లకు ఇచ్చి కూకట్ పల్లి వెళ్లి అక్కడ ఓ వ్యక్తికి దానిని చూపించి నగదును కలెక్ట్ చేసుకొమ్మని చెప్పాడు. ఈ విషయాన్ని కుస్రోద్దీన్ వెంటనే ఉమర్ షరీఫ్ కు చెప్పి దోపిడీకి సిద్ధంగా ఉండాలని సూచించాడు. కూకట్ పల్లి వద్దకు రావాల్సి ఉంటుందని చెప్పాడు.
Also Read: Shrasti Verma: అన్యాయం జరిగింది నాకు.. న్యాయం చేయరా దేవుడా!
ఈ క్రమంలో ఉమర్ షరీఫ్ హమీద్ సద్దాం, చోటూ, సల్మాన్, గౌస్, జీషాన్, జమ్మూలతో కలిసి ద్విచక్ర వాహనాలపై కూకట్ పల్లి చేరుకున్నాడు. ఇక, అజీముద్దీన్ తో కలిసి కూకట్ పల్లి వెళ్లిన కుస్రోద్దీన్ యజమాని చెప్పిన వ్యక్తి నుంచి కోటి రూపాయల నగదును తీసుకున్నాడు. అనంతరం ఇద్దరు కలిసి సుజుకీ బర్గ్ మన్ మోటార్ సైకిల్ పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎప్పటికప్పుడు కుస్రోద్దీన్ తమ కదలికల గురించి చెప్పిన నేపథ్యంలో మూడు బైకులపై వెంబడించిన ఉమర్ షరీఫ్ పిల్లర్ నెంబర్ 836 వద్ద వారిని అడ్డుకున్నాడు. కుస్రోద్దీన్, అజీముద్దీన్ కళ్లల్లో కారం కొట్టాడు. దాంతో బైక్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టటంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఆ వెంటనే ఉమర్ షరీఫ్ అతని సహచరులు నగదు ప్యాక్ చేసి ఉన్న బాక్స్ ను దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. అయితే, గ్యాంగులోని సద్దాం కళ్లల్లో కూడా కారం పడటంతో అతను కూడా రోడ్డుపై పడిపోయాడు. దాంతో తాను తెచ్చిన హోండా యాక్టీవాను అక్కడే వదిలేసిన సద్దాం సహచరులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.
దోపిడీ జరుగుతున్నపుడు గస్తీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వెంటనే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. ఈ క్రమంలో సీఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక, నిందితులను పట్టుకోవటానికి అదనపు డీసీపీలు ఉదయ్ రెడ్డి, సుదర్శన్ ల నేతృత్వంలో ఏసీపీలు నరేశ్ రెడ్డి, మురళీకృష్ణ, సీఐలు సుబ్బారావు, రవికుమార్, ఎస్ఐలు రామకృష్ణ, చంద్రశేఖర్, గిరీష్ కుమార్, నర్సింహలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విచారణలో ఉమర్ షరీఫ్, మహ్మద్ గౌస్ సద్దాం, అబ్దుల్ హమీద్ లు విమానంలో ఇక్కడి నుంచి పారిపోవటానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్టు తెలియటంతో వెంటనే అక్కడికి వెళ్లిన బృందాలు వారిని అదుపులోకి తీసుకుని నగదును సీజ్ చేశాయి. పరారీలో ఉన్న మిగితా నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నట్టు డీసీపీ రితిరాజ్ తెలిపారు. గంటల్లోనే దోపిడీకి పాల్పడ్డ గ్యాంగులోని సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అభినందించారు.
Also Read: Natural Farming: రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి ఘనంగా రైతు మహోత్సవాలు: మంత్రి తుమ్మల!