UP News: ఓ యువకుడు తన మనసుకు నచ్చిన స్టేజి డ్యాన్సర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యుడు అలా చేయడం ఇంట్లోని తల్లి, సిస్టర్స్, సోదరుడికి ఏ మాత్రం ఇష్టంలేదు. అలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వేరే రాష్ట్రానికి వెళ్లినప్పటికీ వదల్లేదు. కుటుంబసభ్యులంతా కలిసి ఆ వ్యక్తిని చంపేసిన ఘటన యూపీలో వెలుగుచూసింది.
యూపీలోని గోరఖ్‌పూర్ ఈ ఘటనకు వేదికైంది. 30 ఏళ్ల అమిత్, ఆర్కెస్ట్రా డ్యాన్సర్ అనితను ప్రేమించాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. సరిగ్గా 2022లో వీరికి పెళ్లి జరిగింది. స్టేజ్ డ్యాన్సర్‌ని పెళ్లి చేసుకోవడం అమిత్ కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టంలేదు. ఆ పెళ్లిని అంగీకరించలేదు. ఈ విషయంలో కుటుంబసభ్యులతో అమిత్ చీటికి మాటికీ గొడవపడేవాడు. ఫ్యామిలీ టార్చర్ తట్టుకోలేక చివరకు ఢిల్లీకి మకాం మార్చాడు అమిత్.
ఇంతవరకు అమిత్ అనుకున్నట్టుగానే జరిగింది. కానీ సమస్యను అమిత్‌ను వెంటాడడం మొదలుపెట్టింది. ఢిల్లీకి వచ్చి రెండేళ్లు గడిచిపోవడంతో సొంతూరు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో కుటుంబసభ్యుల వద్దకు వెళ్లాడు. బుధవారం సాయంత్రం అమిత్ తన భార్యతో కలిసి ఫ్యామిలీ వద్దకు వచ్చాడు.
ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అమిత్‌ను అతడి తల్లి, సిస్టర్స అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు మరింత తీవ్రరూపం దాల్చింది. అమిత్ తల్లి మీరాదేవి, ఇద్దరు సిస్టర్స్, సోదరుడు కలిసి అమిత్ పై రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అమిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ALSO READ: పూజారుల వికృత చేష్టలు.. మందేసి చిందులు వేస్తూ
అడ్డుకోబోయిన భార్య అనితపై భర్త కుటుంబసభ్యులు దాడి చేశారు. ఆమెకి తీవ్రగాయాలు అయ్యాయి. పరిస్థితి గమనించి ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అమిత్-అనిత దంపతులను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మార్గమధ్యలో అమిత్ మృతి చెందాడు. అనితను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. భర్త చనిపోయిన విషయం తెలిసి కన్నీరుమున్నీరు అయ్యింది. అనిత ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశారు పోలీసులు. విచారణ కోసం నలుగురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇలాంటి దారుణానికి పాల్పడటం స్థానికంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.