Murder Case: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో దారుణం జరిగింది. సంసార బంధంపై అనుమానాల కలబోత.. చివరకు ఓ ప్రాణం బలైంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో.. రమేష్ అనే వ్యక్తిని కాశీనాథ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
అక్రమ సంబంధం అనుమానమే హత్యకు దారి
వివరాల్లోకి వెళితే.. బిచ్కుందకు చెందిన రమేష్ అనే వ్యక్తిని.. పెద్ద దేవాడకు చెందిన కాశీనాథ్ అనే వ్యక్తి కత్తితో నరికి హత్య చేశాడు. కాశీనాథ్‌కు తన భార్యపై అనుమానాలు ఉండేవి. తన భార్య రమేష్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న భావనతో అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ నుంచి వచ్చి నేరం చేసిన నిందితుడు
కాశీనాథ్ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, కాశీనాథ్ కు బిచ్కుందకు చెందిన రమేష్ అనే వ్యక్తి గురించి తన భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానాలు తీవ్రంగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కాశీనాథ్ ఇవాళ ఉదయం బిచ్కుందకు ప్రత్యేకంగా వచ్చాడు. అతని పథకం ప్రకారమే వచ్చి ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
బిచ్కుందలో రమేష్‌ను కనిపెట్టిన కాశీనాథ్.. తాను వెంట తెచ్చుకున్న కత్తితో అతనిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన కొంతమంది స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పోలీసుల విచారణ ప్రారంభం
హత్య జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుడు కాశీనాథ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read: డ్రింక్‌లో గడ్డిమందు.. భర్తను లేపేసిన మరో సోనమ్
సామాజిక ప్రశ్నలు, బాధిత కుటుంబం ఆవేదన
భార్య భర్తల మధ్య అవగాహన లేకపోతే, చిన్న అనుమానం కూడా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని.. ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. మృతుడి కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. తమ కుటుంబాన్ని నాశనం చేసిన వాడికి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం కావాలని వారు కోరుతున్నారు.