Warangal Murder Case: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా జరుగుతున్న భర్తల హత్యలు.. మిగతా వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వివాహేతర సంబంధాల కోసం వివాహ బంధాన్నే ఫణంగా పెడుతున్నారు. భర్తల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవలి కాలంలో.. భర్తల హత్యల ఘటనలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. తాజాగా.. వరంగల్ జిల్లాలోనూ అలాంటి సంచలన హత్యే జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. డ్రింక్‌లో గడ్డిమందు కలిపి భర్తను లేపేసింది భార్య.
థమ్స్అప్‌లో గడ్డి మందు..
భర్తకు కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్య చేసిందో భార్య. భవానికుంటలో ఈనెల 8న భర్త భాలాజీకి మద్యంలో కలుపుకునేందుకు.. థమ్స్అప్‌లో గడ్డి మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. భార్య మాటలు నమ్మిన బాలాజీ ఆ డ్రింక్ తాగాడు. కొంత సేపటి తర్వాత అతని గొంతులో మంటలు మొదలయ్యాయి. బలంగా గట్టిగ్గా అరవడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు విషయం గమనించారు. ఆరోగ్య పరిస్థితి దిగజారుతుండడంతో.. సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
భర్త మృతి.. భార్య పరారి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలాజీ.. మరుసటి రోజు మృతి చెందాడు. ఇది ఏ సాధారణ అస్వస్థత కాదు.. హత్య అని గుర్తించిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకుముందే బాలాజీ భార్య కాంతి, భర్త పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే.. తన బావ ఇంటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచి పారిపోయింది. ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు.
కేసు నమోదు – విచారణ మొదలు
బాలాజీ తండ్రి హరిసింగ్ ఫిర్యాదు మేరకు.. వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఈ దారుణానికి బాలాజీ భార్య కాంతి, ఆమె బావ దశరులు సహకరించినట్టు స్పష్టత వచ్చింది. ఈ ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇందుకు కారణం ఏమిటి?
ఇది మామూలు కుటుంబ కలహమా? లేక ఇతర సంబంధాల కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో.. వైవాహిక జీవితాల్లో తలెత్తుతున్న సమస్యలు, వివాహేతర సంబంధాలు చివరకు హత్యల దాకా దారితీస్తున్నాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన.. సంచలనంగా మారింది. తన భర్తని కిరాతకంగా చంపించడానికి భార్యే పూనుకోవడం.. అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. ఇదొక్క ఘటనే కాదు.. కొంతకాలంగా దేశంలో వివిధ చోట్ల భార్యల చేతుల్లో, వారి ప్రేమికుల ప్రమేయంతో హత్య చేయబడుతున్న భర్తల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
వివాహేతర సంబంధాలే.. భర్తల హత్యలకు కారణమా?
చాలా ప్రాంతాల్లో.. ఇలాంటి దారుణాలు బయటకొస్తున్నాయి. కేవలం.. వివాహేతర సంబంధాలే.. భర్తల హత్యలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి.. భార్యలు, వారి ప్రియులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా హత్యలు చూస్తుంటే.. నైతిక విలువలు, సామాజిక కట్టుబాట్లు బలహీనపడుతున్నాయని అర్థమవుతోంది.
Also Read: మీరు మనుషులేనా? విద్యార్థినిపై లెక్చరర్ల అఘాయిత్యం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్!
తమ మధ్య తలెత్తే సమస్యల్ని.. మాట్లాడుకొని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా.. హత్యలకు పాల్పడటమే విషాదకరం. ఈ తరహా ఘటనలు.. సమాజానికి ఓ హెచ్చరికల మారాయి. మొగుళ్ల ప్రాణాలకు రక్షణ లేదనే భయంకరమైన ప్రశ్న.. ఇప్పుడు తలెత్తుతోంది. భర్తల హత్యలు.. కుటుంబ వ్యవస్థకు, వైవాహిక బంధానికి, సామాజిక విలువలకు పెను సవాల్‌గా మారుతున్నాయి. ఈ తరహా నేరాలను అరికట్టాలంటే.. వివాహేతర సంబంధాలతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. ఎంతోమంది అమాయక భర్తల ప్రాణాలు.. ఎప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోతాయి.