Anakapalli crime: అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో గురువారం ఉదయం ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు రిమాండ్ ఖైదీలు సిబ్బందిపై దాడి చేసి జైలు నుండి పరారయ్యారు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగగా, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. పరారైన ఖైదీలు రవికుమార్, రాము. వీరిద్దరూ చిన్ననాటి నేరాలకు పాల్పడినా, ఇటీవల కేసుల వలన రిమాండ్‌లోకి వెళ్లారు. అయితే సబ్ జైలు నుండి బయటపడటానికి వీళ్లు ఆడిన గేమ్ ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
సాధారణంగా సబ్ జైలులో భద్రత సడలింపు స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో రవికుమార్, రాము అనే ఇద్దరు రిమాండ్ ఖైదీలు ఒక్కసారిగా జైలు సిబ్బందిపై దాడి చేశారు. హెడ్ వార్డర్‌పై సుత్తితో దాడి చేసి, తాళాలు దొంగిలించుకున్న తర్వాత గేటును తెరిచి పారిపోయారు. ఇది క్షణాల్లో జరిగిన సంఘటన కావడంతో సిబ్బంది ఒక్కసారిగా కంగారు పడ్డారు.
పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో రవికుమార్ జైల్లో ఉన్నాడు. వృద్ధుల నుంచి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని ఆయనపై కేసు నమోదైంది. మరోవైపు బెజవాడ రాము చోరీ కేసులో నిందితుడిగా జైలులో ఉన్నాడు. చిన్న చిల్లర దొంగతనాలతో మొదలైన రాముకు గతంలోనే పలుమార్లు పోలీసుల చేతిలో చిక్కాడు. వీరిద్దరూ ఒకే సమయంలో పరారయ్యారు అంటే ముందుగానే ప్రణాళిక వేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పరారీ విషయం తెలిసిన వెంటనే చోడవరం పోలీసులు, రూరల్ పోలీస్ బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సమీపంలోని అటవీ ప్రాంతాలు, రోడ్డు మార్గాలు, బస్ స్టాండ్లు అన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్ సహాయంతో కూడా గాలింపు జరుగుతుందని సమాచారం. ప్రజలకు కూడా హెచ్చరిక జారీ చేశారు. వీరి గురించి ఎవరైనా సమాచారం ఇచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు.
ఈ ఘటనతో చోడవరం సబ్ జైలు భద్రతపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. రిమాండ్ ఖైదీలు సిబ్బందిపై దాడి చేసి పారిపోవడం అంటే భద్రతా వ్యవస్థలో పెద్ద లోపాలున్నాయని స్పష్టమవుతోంది. సుత్తి లాంటి వస్తువు ఖైదీల చేతికి ఎలా చేరిందన్న ప్రశ్న లేపుతోంది. అంతేకాకుండా జైలు సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో పహారా సరైన విధంగా లేకపోవడం కూడా ప్రధాన కారణమని భావిస్తున్నారు.
Also Read: MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?
ఇద్దరు నేరస్థులు బయటకు పారిపోవడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇద్దరూ చిన్న కేసుల్లో ఉన్నా, ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతుండటంతో మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడతారో తెలియదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు ప్రత్యేకంగా భయపడుతున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. జైలు సిబ్బందిలో నిర్లక్ష్యం ఎవరికి ఉందో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా హెడ్ వార్డర్‌పై దాడి చేసిన రీతిని బట్టి ఇది హఠాత్పరిణామం కాదని, ముందే ప్రణాళిక ప్రకారమే జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఒకవైపు నేరాలు తగ్గించేందుకు పోలీసులు కృషి చేస్తుంటే, మరోవైపు జైలు నుండి ఖైదీలు తప్పించుకోవడం పెద్ద ఆందోళన కలిగిస్తోంది. రవికుమార్, రాము కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టగా, వీరు త్వరలోనే పట్టుబడతారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన జైలు భద్రతా లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా ఎలాంటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయో చోడవరం ఘటనతో స్పష్టమైంది.