AP News : భారతీయుడు సినిమాలో హీరో కమలహాసన్ చేతి రెండు వేళ్లతో ప్రత్యర్థులను దెబ్బ తీస్తాడు. అది కేరళలో పాపులర్ అయిన మర్మ యుద్ధవిద్య. ఆ రోజుల్లో ఉండేవి అలాంటి యుద్ధ నైపుణ్యాలు. ఇప్పట్లో అలాంటి యుద్ధ కళలు పూర్తిగా కనుమరుగయ్యాయి. కానీ, యూట్యూబ్ పుణ్యాన అవి మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్, వార్ ట్రిక్స్ తదిలర పేర్లతో చైనా, జపాన్, ఇండియాకు చెందిన పలు వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. అలానే, ఓ కేటుగాడు యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. రెండు వేళ్లతో ఎలా చంపాలో నేర్చుకున్నాడు. బాగా ప్రాక్టీస్ కూడా చేశాడు. ఆ స్కిల్‌పై పూర్తిగా పట్టు సాధించాక ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బంగారం కోసం తనకు తెలిసిన మహిళను కిరాతకంగా చంపేశాడు. శవాన్ని అడవిలో పాతేశాడు. కర్నాటక, ఏపీలో సంచలనంగా నిలిచింది ఈ హత్య.
నమ్మి వచ్చిన మహిళ దారుణ హత్య
అతని పేరు నరసింహమూర్తి. దేవుడి పేరు పెట్టుకుని ఫక్తు రాక్షసుడిగా మారాడు ఆ దుర్మార్గుడు. నమ్మి వచ్చిన మహిళను దారుణంగా హత్య చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర మండలం ఉగ్రేపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 2 వారాల క్రితం గుర్తుతెలియని మహిళ డెడ్‌బాడీ కనిపించింది. పాతి పెట్టిన శవాన్ని.. వీధి కుక్కలు బయటకు లాగాయి. బ్యాడ్ స్మెల్ రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చనిపోయింది ఎవరో తెలీలేదు.
మిస్సింగ్ కేసుతో ట్రేస్
మిస్సింగ్ కేసులను ట్రేస్ చేశారు పోలీసులు. కర్ణాటకలోని అరసికెర పీఎస్‌లోని మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా ఆ డెడ్‌బాడీని అదే రాష్ట్రానికి చెందిన 29 ఏళ్ల ఉమాదేవిదిగా గుర్తించారు. పేరెంట్స్ ఇచ్చిన డీటైల్స్‌తో ఎంక్వైరీ చేస్తే.. హంతకుడు ఏపీలోని మడకశిర మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన పి. నరసింహమూర్తి అని గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ నిజాలు తెలిశాయి.
అక్రమ సంబంధం.. బంగారం కోసం…
ఉమాదేవి, నరసింహమూర్తి ఇద్దరికీ బెంగళూరులో పరిచయం. వారి మధ్య వివాహేతర సంబంధం ఉంది. నిందితుడు బాగా అప్పుల పాలు అయ్యాడు. అవి ఎలా తీర్చాలో తెలీక ఇబ్బందిపడుతున్నాడు. అదే టైమ్‌లో అతనికో దుర్మార్గపు ఆలోచన వచ్చింది. ఉమాదేవి దగ్గర చాలా బంగారం ఉందని తెలుసుకున్నాడు. ఆమెను చంపేసి ఆ గోల్డ్ దోచుకోవాలని స్కెచ్ వేశాడు. ఎలా చంపాలా అని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. రెండు వేళ్లతో హత్య చేసే టెక్నిక్ అతనికి బాగా నచ్చింది. అలా చంపితే ఎలాంటి ఆనవాళ్లు లేకుండా తప్పించుకోవచ్చని ప్లాన్ చేశాడు.
అడవిలో చంపేసి.. పూడ్చేసి..
గతేడాది నవంబర్ 16న కలుద్దాం అంటూ.. ఉమాదేవిని కర్నాటక నుంచి ఏపీలోని మడకశిర మండలం ఉగ్రేపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ నిర్మానుష ప్రదేశంలో తాను ప్రాక్టీస్ చేసిన రెండు వేళ్లతో చంపే టెక్నిక్ ప్రయోగించాడు కానీ అది వర్కవుట్ కాలేదు. వెంటనే ఆమె మెడకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. శవాన్ని అక్కడే ఇసుకలో పూడ్చి పెట్టాడు. తనకేమీ తెలీదన్నట్టుగా స్వగ్రామంలో మామూలుగానే ఉంటున్నాడు.
Also Read : పాస్టర్ ప్రవీణ్ కేసులో అసలేం జరిగిందంటే.. కంప్లీట్ డీటైల్స్..
కుక్కలు చేసిన పనికి.. బయటపడిన హత్య
కట్ చేస్తే.. కుక్కలు ఉమాదేవీ శవాన్ని బయటకు లాగడంతో హత్యోదంతం 4 నెలల తర్వాత బయటపడింది. అప్పటికే డెడ్‌బాడీ కుళ్లిన స్థితికి చేరింది. తీగలాగితే.. మిస్సింగ్ కేసు ఆధారంగా ఉమాదేవి ఉదంతం బయటపడింది. ఆమె తల్లిదండ్రులు చెప్పిన డీటైల్స్ ఆధారంగా నరసింహమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే .. బంగారం కోసం తానే హత్య చేశానని ఒప్పేసుకున్నాడు. యూట్యూబ్ చేసి ఎలా మర్డర్ చేయాలో ప్రాక్టీస్ చేశానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని మడకశిర కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించారు.