BigTV English

Pastor Praveen Pagadala Case : ఆ రోజు అసలేం జరిగింది? ప్రవీణ్ ఎలా చనిపోయారు? కంప్లీట్ డీటైల్స్

Pastor Praveen Pagadala Case : ఆ రోజు అసలేం జరిగింది? ప్రవీణ్ ఎలా చనిపోయారు? కంప్లీట్ డీటైల్స్

Pastor Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్‌ మృతి చెంది రోజులు గడుస్తున్నాయి. ఇంత వరకు ఆయన మృతి సాధారణమా? అసాధారణమా? ఆయనను హత్య చేశారా? లేక ప్రమాదవశాత్తు మరణించారా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. ఓ వైపు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.. సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ఎవరికి తోచిన కథనాలు వాళ్లు వండి వారుస్తున్నారు.. కానీ అసలు నిజం ఏంటన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. పలు క్రిస్టియన్ సంఘాల అనుమానాలు తీరడమే లేదు.


మార్చి 25 : ఆ రోజు ఉదయం..

రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని గత నెల 25న ఉదయం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ.. ఆయన అనుచరులు అనుమానాలు వ్యక్తం చేశారు. దానికంటే ముందు ఆయన తనకు ప్రాణహాని ఉందంటూ ఓ వీడియో చేయడం.. అంతలోనే మరణించడంతో ఇక అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనికి తగ్గట్టుగా అనేక మంది దర్యాప్తు చేస్తూ.. అది హత్య అంటూ వీడియోలు చేయడం.. అవి వైరల్‌గా మారడం పెద్ద దుమారాన్ని రేపాయి.


సీసీఫుటేజ్‌లో షాకింగ్ దృశ్యాలు.. అప్పుడే జస్ట్ మిస్!

సీసీకెమెరా ఫుటేజ్‌తో పాస్టర్ ప్రవీణ్‌ మృతికి ముందు జరిగిన అనేక విషయాలపై క్లారిటీ వచ్చింది. ఆయన చనిపోవడానికి ముందు అనేకసార్లు ప్రమాదానికి గురయ్యారని తేలింది. అనేక సీసీ ఫుటేజీ వీడియోలు బయటికి వచ్చాయి. హైదరాబాద్ నుంచి బైక్‌పై బయల్దేరిన ప్రవీణ్‌ కుమార్.. విజయవాడకు చేరుకోకముందే ప్రమాదానికి గురయ్యారు. చిల్లకల్లు టోల్‌ ప్లాజాకు ముందు.. తృటిలో బయటపడ్డ ప్రవీణ్‌.. జగ్గయ్యపేట దగ్గర హైవేపై బారికేడ్లను క్రాస్‌ చేసేటప్పుడు లారీ పక్కనే అదుపు తప్పి పడిపోయారు. లారీ చక్రాల కింద పడకుండా వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఆ వెనకే ఆర్టీసీ బస్సు వస్తుండగా.. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. బస్సును రోడ్డుకు మరోవైపు తీసుకెళ్లడంతో ప్రవీణ్ అక్కడ సేఫ్‌గా బయటపడ్డారు.

గోడను గుద్ది.. మరో యాక్సిడెంట్

ఆ తర్వాత కాసేపటికే.. కీసర టోల్‌గేట్‌ దగ్గర మరోసారి అదుపు తప్పి గోడను ఢీకొట్టారు ప్రవీణ్‌.
కీసర టోల్‌గేట్‌ దగ్గరకు అతివేగంతో వచ్చిన పాస్టర్ ప్రవీణ్‌.. మలుపులో బైక్‌ను కంట్రోల్ చేయలేకపోయారు. టోల్‌గేట్ వైపు రాకుండా నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి పడిపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి..

హెడ్‌లైట్ అక్కడే పగిలిందా?

ఈ యాక్సిడెంట్ తర్వాత పగిలిన హెడ్‌లైట్‌తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్‌ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది. అక్కడ కాసేపు ఆగి మళ్లీ బయలుదేరినా… బైక్ నడపడానికి ప్రవీణ్‌ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు. అలా కష్టపడుతూ గొల్లపూడి ప్రెటోల్‌బంక్‌కు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు ప్రవీణ్‌ చేరుకున్నారు. అప్పటికే బైక్‌ హెడ్‌లైట్‌ ఊడిపోయి వేలాడుతోంది. బైక్ నడపడంలో పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్లు కనిపించారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బంక్‌ నుంచి బయటికి వచ్చేప్పుడు కూడా ఆయన బైక్‌ను నడిపిన విధానం చూస్తే.. ఆయనకు అస్సలు ఓపిక లేనట్టే కనిపించింది.

ఆ ట్రాఫిక్ ఎస్సై చెప్పింది వినుంటే..

పెట్రోల్‌బంక్‌ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంజ్‌ సర్కిల్‌ చేరుకున్నారు. ఆ తర్వాత రామవరప్పాడు రింగ్ దగ్గరకు రాగానే మరోసారి రోడ్డుపై పడిపోయారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్‌.ఐ, స్థానికులు ఆయన్ను లేపి పక్కన కూర్చోబెట్టారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పరిస్థితి చూసి, రెస్ట్ తీసుకోవాలని, జర్నీ చేయవద్దంటూ సూచించారు ఎస్‌ఐ సుబ్బారావు. దాదాపు 3 గంటల పాటు అక్కడ కూర్చున్న ప్రవీణ్.. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి రాజమండ్రి వైపు వెళ్లిపోయారు

ఆ రాత్రి ఏం జరిగిందంటే..

మరణానికి ముందు ప్రవీణ్ పగడాల వీడియోలు కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అప్పుడు సమయం సుమారు పదకొండున్నర కావస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ కాస్త స్లో గా ఆయన తన బుల్లెట్ బైక్ ని నడుపుతున్నారు. ఇండికేటర్ వేసుకుని బండి నడుపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడా బైక్‌కి హెడ్‌లైట్‌ కూడా వెలగడంలేదు. ఆ తర్వాత 11 నిమిషాలకే ఆయన అనూహ్యంగా మరణించారు.

ప్రవీణ్ మరణానికి కారణం ఏంటి?

కొవ్వూరు టోల్‌గేట్‌ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన బుల్లెట్‌ బైక్‌కి ఒక్కసారిగా ఏదో అయినట్టు విజువల్స్‌లో తెలుస్తోంది. కానీ ఏం జరిగింది అన్నది స్పష్టంగా అర్థం కావడం లేదు. వెనక నుంచి వస్తున్న ఏదైనా వాహనం ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్‌ని ఢీకొట్టిందా అంటే దానికీ సరైన ఆధారాలు దొరకటం లేదు. ఎందుకంటే ఏదైనా వాహనం ఢీకొంటే శబ్దం వస్తుంది. అదే జరిగితే కనీసం ఆ సమయంలో అటువైపు వెళ్తున్న వాహనం ఏదో ఒకటి ఆపి ఉండేవారు. ఇక్కడ అలాంటిదేం జరగలేదు. వాహనాలు సాఫీగా వెళ్లిపోయాయి. రాత్రంతా ఆయన మృతదేహం అక్కడే ఉంది. పోలీసులు కూడా ఏ వాహనం పాస్టర్‌ బైక్‌ను ఢీకొట్టలేదని ఇప్పటికే తేల్చారు. ప్రవీణ్ బైక్ వెనుక వచ్చిన వాహనాల యజమానులను పిలిపించి ప్రశ్నించారు. దీంతో ప్రవీణ్ బైక్ అదుపుతప్పి గుంతలోకి వెళ్లిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇంత క్లియర్‌గా ఉన్నా.. ఇంకా అనేక డౌట్స్

అయితే ఇన్ని వీడియోలు బయటికి వచ్చినా.. ప్రమాదమని సూచించేందుకు చాలా సంకేతాలు కనిపిస్తున్నా క్రిస్టియన్ సమాజంలో మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా హత్యే అని నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. అంతేకాదు హర్షకుమార్, కేఏ పాల్ లాంటి కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇది హత్యే అని గట్టిగా వాదిస్తున్నారు. వాళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పుడు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చి ప్రమాదమని తేల్చినా.. మేం నమ్మమని చెప్పేలా ఉన్నారు. అంతేకాదు అవసరమైతే రీపోస్ట్‌మార్టమ్ చేపిస్తామని.. తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపిస్తామంటున్నారు.

జెస్సికా పిలుపు.. ఇకనైనా ఆపండ్రా!!

ఇలా ప్రవీణ్‌ మృతిపై రచ్చ జరుగుతున్న సమయంలోనే ఆయన భార్య జెస్సికా స్పందించారు. ప్రవీణ్‌ మరణాన్ని కొందరు మత, రాజకీయ లబ్దికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున అందరూ కొన్నాళ్లు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. యూట్యూబర్లు, వ్లాగర్స్ కాస్త సంయమనం పాటించి.. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని రిక్వెస్ట్ చేశారు ప్రవీణ్‌ పగడాల సొదరుడు కిరణ్. ప్రభుత్వంపై తమకు పూర్తి భరోసా ఉందని.. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని సూచించారు.

పక్కాగా పోలీస్ ఎంక్వైరీ.. కానీ…..

పోలీసులు ప్రవీణ్ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆయన ప్రయాణించిన రూట్‌లో దాదాపుగా విచారణ పూర్తి చేశారు. కేసును నేరుగా సీఎం చంద్రబాబు సమీక్షిస్తుండటంతో పక్కాగా దర్యాప్తు జరుగుతోంది. ప్రవీణ్‌ పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ నివేదికలు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి పోలీసులు చెప్పే వివరాలతో క్రిస్టియన్ సమాజం ఏకీభవిస్తుందా? ఒకవేళ ఆ వివరాలను అంగీకరించకపోతే పరిస్థితి ఏంటి? అనేది కాస్త ఆందోళనరక అంశం. ఒక విషయం మాత్రం నిజం. పాస్టర్ చనిపోవడానికి ముందు చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారు. కనీసం విజయవాడలో అయినా ఆగిపోయి రెస్ట్ తీసుకుని ఉంటే, ఇవాళ ఏదో ఓ సభలో పాస్టర్‌ ప్రవీణ్‌ ప్రసంగిస్తూ కనిపించేవాళ్లు. కానీ, మొండిగా ముందుకు వెళ్లడంతోనే ఆయన ప్రాణం పోయినట్లు కనిపిస్తోంది. కాకపోతే ఆయన ఎలా చనిపోయారనేదే ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×