Mathura Boat Capsize Yamuna River: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మథురలో ఘోర ప్రమాదం సంభవించింది. బృందావన్‌లోని యమునా నదిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 25 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. యమునా నదిపై ప్రయాణిస్తున్న క్రమంలో సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను పడవ బలంగా ఢీకొట్టింది. వంతెనను ఢీకొట్టిన ధాటికి పడవ ఒక్కసారిగా తిరగబడింది. ప్రయాణీకులందరూ నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు కొంతమందిని రక్షించే ప్రయత్నం చేశారు.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం.. నదిలో నుంచి తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొంత మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. గల్లంతైన వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మథురలో పడవ బోల్తా పడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ ప్రమాదం నన్ను ఎంతగానో కలచివేసింది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని పీఎం పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడంలో స్థానిక యంత్రాంగం నిమగ్నమై ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Also: ప్రధాని మోదీ హత్యకు కుట్ర? CIAతో డీల్? బీహార్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్