Marriage Frauds: స్వేచ్ఛ బ్యూరో: నువ్వు నాకు నచ్చావ్.. అంటూ ఆన్ లైన్ లో పరిచయం అయినవారు ప్రపోజల్ చేశారా?.. ఫలానా మ్యాట్రిమోనియల్ ప్లాట్ ఫాంలో మీ ఫోటో చూశా.. పెళ్లికి సిద్ధం అంటూ మెసెజీ వచ్చిందా?.. సోషల్ మీడియా ద్వారా స్నేహం చేసుకున్నవారు ఒకసారి బయట కలుద్దామని చెప్పారా?.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మీరు సర్వం కోల్పోవటం ఖాయం. వివాహాల పేర ఉచ్ఛులోకి లాగి అందినకాడికి డబ్బు కొల్లగొడుతున్నవారు కొందరైతే.. అభ్యంతరకరంగా వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ లూటీ చేస్తున్నవారు మరికొందరు. నిశ్చితార్థం వరకు విషయాన్ని తీసుకెళ్లి ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా అని చెప్పి కోరికలు తీర్చుకుని భారీ మొత్తంలో కట్నం ఇస్తేనే లగ్గం అని మోసం చేస్తున్నవారు ఇంకొందరు. ఈ తరహా మోసాలకు సంబంధించి ఇటీవలిగా షీ టీమ్స్‌కు వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో బహుపరాక్ అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ మహిళా డాక్టర్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఓ మ్యాట్రిమోనియల్ ప్లాట్ ఫాంలో తన వివరాలను అప్ లోడ్ చేసింది. ఆ తరువాత కొన్నిరోజులకు ఓ వ్యక్తి ఆమెను వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. తన పేరు హిరాద్ అహమద్ అని.. యూకేలో డాక్టర్ గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఇలా వాట్సాప్ మెసెజీలు, ఛాటింగులతో సన్నిహితమయ్యాడు. మీ ప్రొఫైల్ నచ్చింది. పెళ్లి సిద్ధం అని చెప్పాడు. దీనికి మహిళా డాక్టర్ అంగీకరించింది. ఆ తరువాత రకరకాల కారణాలు చెప్పి ఆమె నుంచి 10లక్షలకు పైగా కొల్లగొట్టాడు. అతను పంపించిన వీసా, పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్లు నకిలీవని తేలిన తరువాత మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే టాలీవుడ్ కు చెందిన ఓ నటిపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కొడుకు నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకుందని లండన్ లో ఉంటున్న ధర్మేంద్ర అనే యువకుని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు చేయగా హైదరాబాద్ సీసీఎస్ లో కేసులు నమోదయ్యాయి.
దిల్ సుక్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి కొన్నిరోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఎలాగూ ఎంగేజ్ మెంట్ అయిపోయింది. పెళ్లి చేసుకోవటమే మిగిలింది అని చెప్పి యువతిని తీసుకెళ్లిన యువకుడు కోరికలు తీర్చుకున్నడు. ఆ తరువాత నీ ముఖంపై మచ్చలు ఉన్నాయి. అందంగా లేవు.. అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దాంతో బాధితురాలు మల్కాజిగిరి కమిషనరేట్ షీ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు సదరు యువకున్ని అరెస్ట్ చేశారు.
Also Read: అధికారుల దొంగ రిపోర్టులకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!
అన్నదమ్ములైన అర్జున్.. ప్రవీణ్ లు ఇన్ స్టాగ్రాం ద్వారా సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను ట్రాప్ లోకి లాగి లక్షలు వసూలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. డబ్బున్న కుటుంబాలకు చెందిన వారిలా ఇన్ స్టాగ్రాంలో ఫోటోలు అప్ లోడ్ చేసి మైనారిటీ తీరని బాలికలతో ఫ్రెండ్ షిప్ చేసుకున్న ఈ ఇద్దరు వారిని బయటకు పిలిపించేవారు. ఆ తరువాత కారులో తిప్పుతూ లైంగిక దాడులకు పాల్పడి దానిని వీడియో తీసేవారు. ఈ రికార్డింగులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు కొల్లగొట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను ఇలా ఉచ్ఛులోకి లాగి 13లక్షల రూపాయలు దండుకున్నారు. ఫిర్యాదు అందగా పోలీసులు ఈ ఇద్దరితో మరికొందరిని అరెస్ట్ చేశారు. ఇలా చెబుతూ పోతే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి.
ఇలాంటి వారి బారిన పడి మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే మార్గమని పోలీస్ అధికారులు చెబుతున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్లు చూసి పెళ్లికి సిద్ధపడకూడదని సూచిస్తున్నారు. అదే సమయంలో పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మేయ వద్దన్నారు. అవతలి వ్యక్తి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై పెళ్లికి ముందే క్షుణ్నంగా తనిఖీ చేసుకోవాలని చెప్పారు. నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరిగే వరకు అప్రమత్తంగానే ఉండాలన్నారు. వివాహానికి ముందు ఏకాంతంగా కలవటానికి…శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా అనుమానించాలని చెప్పారు. ఇలాంటి ప్రతిపాదనలను ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరించాలన్నారు. డబ్బు డిమాండ్ చేసినా…బ్లాక్ మెయిల్ చేసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డయల్ 100కు కూడా ఫోన్ చేసి కంప్లయింట్ ఇవ్వొచ్చని చెప్పారు.
Also read: అమ్మాయిల లోదుస్తుల్లో అబ్బాయిలు.. చైనాలో కొత్త ట్రెండ్, అసలు కారణం ఇదే!