Medical Negligence: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందంటూ బాధితుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రాంతానికి చెందిన లెక్చరర్ నరేష్, గుండెలో స్వల్ప అసౌకర్యంగా ఉందనే కారణంతో చికిత్స కోసం నగరానికి వచ్చారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, కేవలం పరీక్షల కోసం వెళ్లి శవమై తిరిగిరావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
జూనియర్ డాక్టర్ల చేతికి ఆపరేషన్ బాధ్యత?
నరేష్‌కు పరీక్షలు నిర్వహించిన కామినేని వైద్యులు, వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. అయితే, ఈ ఆపరేషన్‌ను అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు చేయాల్సి ఉండగా, కేవలం జూనియర్ డాక్టర్లతో చేయించారని మృతుడి బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అనుభవం లేని చేతుల్లోకి ప్రాణాలను అప్పగించడం వల్లే నరేష్ ప్రాణాలు కోల్పోయారని, మేనేజ్మెంట్ లాభాపేక్షతో రోగి ప్రాణాలతో చెలగాటమాడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్షల ఫీజులు.. చివరికి మిగిలింది విషాదమే
ఈ ఆపరేషన్ కోసం ఆసుపత్రి యాజమాన్యం దాదాపు రూ. 8 లక్షలు ఖర్చు అవుతుందని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ ద్వారా రూ. 5 లక్షలు ఇప్పటికే వసూలు చేసుకున్నారని సమాచారం. భారీగా ఫీజులు వసూలు చేయడంలో చూపిన శ్రద్ధ, ప్రాణాలు కాపాడటంలో చూపలేదని బాధితులు మండిపడుతున్నారు. డబ్బులు చెల్లించుకున్నాక, ఆపరేషన్ థియేటర్ నుంచి నరేష్ విగతజీవిగా బయటకు రావడంతో కుటుంబం రోడ్డున పడింది.
Also Read: వివాహేతర బంధం కోసం ఘాతుకం.. భర్తను సుపారీ ఇచ్చి చంపించిన భార్య!
న్యాయం కోసం బాధితుల పోరాటం
నరేష్ మృతికి కారణమైన డాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. బాధ్యులైన వారిని అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక విద్యావంతుడు, సమాజానికి పాఠాలు చెప్పే లెక్చరర్ ఇలా ఆసుపత్రి నిర్లక్ష్యానికి బలికావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
డాక్టర్ల నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో ఘటన
జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేశారని బంధువుల ఆరోపణ
గుండెలో చిన్న నొప్పి ఉందని హాస్పిటల్ కి వెళ్లిన..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కు చెందిన లెక్చరర్ నరేష్టెస్టుల అనంతరం ఆపరేషన్ చేయాలన్న డాక్టర్స్
ఆపరేషన్… pic.twitter.com/oBAdOUVztl
— BIG TV Breaking News (@bigtvtelugu) April 16, 2026