Nagarkurnool: నమ్మిన భర్తను కాదని కన్నకూతురి మొగుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుందో భార్య. ఈ విషయం తెలిసి సదరు భర్త నిలదీయడమే అతను చేసిన పాపమైంది. తమ సుఖానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ భార్య, అత్యంత కిరాతకంగా భర్తను హతమార్చింది. ఆపై ఏమీ తెలియనట్టు గుండెపోటుతో చనిపోయాడంటూ డ్రామాలాడింది. చివరకు అంత్యక్రియల సమయంలో శవంపై ఉన్న గాయాలు చూసి బంధువులు నిలదీయడంతో అసలు పాపం బయటపడింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అల్లుడితో అక్రమ సంబంధమే కారణం
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు. హాయిగా సాగిపోతున్న వీరి కాపురంలో అల్లుడు ఆంజనేయులు ప్రవేశించాడు. కూతురి భర్త అని కూడా చూడకుండా అలివేలు తన సొంత అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్తా భర్త యాదయ్యకు తెలియడంతో ఇంట్లో రోజూ గొడవలు మొదలయ్యాయి. అల్లుడితో తిరగవద్దని, పద్ధతి మార్చుకోవాలని యాదయ్య భార్యను గద్దించాడు. దీంతో తన సుఖానికి భర్త అడ్డుపడుతున్నాడని అలివేలు అతనిపై కక్ష పెంచుకుంది.
అనారోగ్యం అంటూ నాటకం
ఈ క్రమంలోనే ఈ నెల 23న యాదయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త చనిపోగానే అలివేలు ఏడుస్తూ నాటకమాడింది. ఆయనకు తీవ్ర అనారోగ్యం చేసిందని, అందుకే గుండె ఆగి చనిపోయాడని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించింది. అందరూ నిజమేనని నమ్మి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
స్నానం చేయిస్తుండగా బయటపడ్డ గాయాలు
అయితే సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలకు ముందు యాదయ్య శవానికి స్నానం చేయించి దుస్తులు మారుస్తుండగా బంధువులకు అసలు నిజం తెలిసింది. యాదయ్య శరీరంపై, ముఖ్యంగా మర్మాంగాల వద్ద తీవ్ర గాయాలు ఉండటాన్ని మృతుడి అన్న కుమారుడు పరశురాములు గమనించాడు. అనారోగ్యంతో చనిపోతే ఇన్ని గాయాలు ఎందుకు ఉంటాయని అనుమానిస్తూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీస్ విచారణలో దిమ్మతిరిగే నిజాలు
రంగంలోకి దిగిన పోలీసులు అలివేలును తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతోనే, అతని మర్మాంగాలపై బలంగా దాడి చేసి హత్య చేసినట్లు అలివేలు అంగీకరించింది. కాగా, యాదయ్య చనిపోయిన రోజునే కూతురు, అల్లుడు కూడా వచ్చి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ హత్యలో అల్లుడు ఆంజనేయులు, కూతురి పాత్ర కూడా ఉందనే అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.