Telangana: స్వేచ్ఛ బ్యూరో: కల్తీ కల్లు తయారీలో ఉపయోగించే అల్ఫ్రాజోలెం తయారు చేసి అమ్ముతున్న గ్యాంగును ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 39కిలోల అల్ఫ్రాజోలెం, 85లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ కెమిస్ట్ ఉండటం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట ఔటర్ రింగ్ రోడ్డులోని కలకుంట కాలనీ సమీపంలో కొందరు అల్ఫ్రాజోలెం విక్రయిస్తున్నట్టు హైదరాబాద్ జోన్ ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది.
వెంటనే దాడి జరిపిన అధికారులు రెండు కార్లలో వెళుతున్న ఇద్దరిని పట్టుకున్నారు. కార్లలో తనిఖీ చెయ్యగా 39కిలోల అల్ఫ్రాజోలెం.. అది అమ్మగా వచ్చిన 85లక్షల నగదు దొరికింది. వీరిని జరిపిన విచారణలో వెళ్లడైన వివరాల మేరకు అధికారులు హైదరాబాద్ మదీనాగూడలో మరో వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో నిందితులు చాలా కాలంగా అల్ఫ్రాజోలెం దందా చేస్తున్నట్లు వెల్లడైంది. దీనిని తయారు చేస్తున్న నిందితుడు కెమిస్ట్రీలో ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ కావటం గమనార్హం.
ఫ్రీలాన్స్ కెమిస్ట్‌గా పనిచేస్తున్న అతను హైదరాబాద్ ప్రశాంత్‌నగర్ ప్రాంతంలో ఉన్న తన ప్రయోగశాలలో అల్ఫ్రాజోలెం తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా సప్లై చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. గడిచిన 5ఏళ్లలో ఈ గ్యాంగ్ గత 150 కిలోలకు పైగా అల్ఫ్రాజోలెం తయారు చేసి అమ్మినట్టు వెళ్లడయ్యింది. ముగ్గురు నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి సిద్దిపేట కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలించారు. ఈ రాకెట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ సాగుతోంది. మాదక ద్రవ్యాల దందా గురించి తెలిసిన వారు టోల్ ఫ్రీ నంబర్-1933కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా పెడతామని తెలిపారు.
Also Read: కవిత ఊహించని స్కెచ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు?