Visakha Crime News: విశాఖ సిటీలో మేఘాలయ హోటల్‌లో ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పద మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఘటన జరగ్గా, శనివారం వెలుగులోకి వచ్చింది. ఎన్నారై మహిళ మృతి వెనుక అసలేం జరిగింది? ఘటనకు ఎందుకు హోటల్ వేదికైంది? ఎవరైనా వచ్చి బెదిరింపులకు దిగారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఎన్నారై అనుమానాస్పదంగా మృతి
సీతమ్మధారకు చెందిన 48 ఏళ్ల మహిళ అమెరికాలో సెటిలైంది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విశాఖ సిటీకి చెందిన మరొక డాక్టర్ శ్రీధర్ కూడా అమెరికాలో స్థిరపడ్డారు. శ్రీధర్‌కు ఆ మహిళతో స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట విశాఖ వచ్చిన డాక్టర్ శ్రీధర్, ఓ హోటల్‌లో అద్దెకు ఉంటున్నారు. అదే సమయంలో ఎన్‌ఆర్‌ఐ మహిళ కూడా విశాఖ వచ్చింది.
ద్వారకానగర్‌లోని ఓ ప్రైవేటు స్థలం లీజ్ అగ్రిమెంటు చేసుకోవడానికి అమెరికా నుంచి ఆ మహిళ వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీధర్ గదిలో తాను ఉంటున్నారు. ఇరువురు మధ్య ఏం జరిగిందో తెలీదు. గురువారం మధ్యాహ్నం ఆమె బాత్రూంలో వెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాలేదు. అదే గదిలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.
సిబ్బంది సహకారంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఆమె విగతజీవిగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. హోటల్ గదిలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాత్రూంలో ఉరి వేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించలేదు. గుండెపోటు ఏమైనా వచ్చిందా? అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇదంతా ఒక వెర్షన్.
ALSO READ: మనవడి చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తాత
మరోవైపు శ్రీధర్ ఫోన్‌లో ఉన్న వీడియోలపై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గొడవ నేపథ్యంలో మనస్తాపానికి గురై మహిళ, ఆత్మహత్య చేసుకుందా? హత్యకు గురైందా? అనేది అసలు ప్రశ్న. మృతురాలి ఒంటిపై దాదాపు రూ.20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం సమయానికి మహిళ మృతదేహం ఉబ్బిపోయింది. దుర్వాసన వస్తోందని మార్చురీ వర్గాలు చెప్పాయి.
ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
మార్చి ఆరున (గురువారం) మధ్యాహ్నం 1.15 గంటలకు మహిళ మృతి చెందినట్టు హోటల్ సిబ్బంది త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం వరకు ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఈ ఘటనను గోప్యంగా ఉంచారు. శుక్రవారం సమాచారం తెలుసుకున్న మీడియా వివరాలు కోరింది. అలాంటి ఘటన ఏది జరగలేదని వారిని తప్పుదోవ పట్టించారు. మహిళ భర్త అమెరికా నుంచి విశాఖకు శనివారం వచ్చారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వాస్తవాలు వెల్లడి కానున్నాయి. ఆమె మృతికి కారణం ఏమిటనేది దర్యాప్తులో తేలనుంది. వాస్తవంగా ఆమెది ఆత్మహత్య అయితే మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. బాధితులు సంపన్న వర్గానికి చెందినవారు. అందుకే వివరాలను బయట పెట్టొద్దని కోరినందు వల్లే చెప్పడం లేదని అంటున్నారు కొందరు పోలీసులు.