Ramadugu Murder Case: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గురువారం (మార్చి 05) పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఈరెల్లి గౌరమ్మ అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 8వ తేదీన గౌరమ్మ పెద్ద కుమారుడు మహేష్ వివాహం జరగాల్సి ఉంది. గౌరమ్మ భర్త కొమురయ్య గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి వచ్చేసరికి భార్య రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె పక్కనే కత్తి ఉండటంతో హతాశుడైన ఆయన ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ వివరాలను సేకరించారు. మృతురాలు గౌరమ్మకు మహేష్.. అనిల్ కుమార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్ ఇటీవలే వివాహం నిశ్చయం కావడంతో సింగపూర్ నుండి స్వగ్రామానికి వచ్చాడు. అయితే మహేష్ ఇండియాకు వచ్చినప్పటి నుండి అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. హత్య జరిగిన సమయంలో భర్త ఫంక్షన్‌కు.. పెద్ద కుమారుడు మహేష్ కరీంనగర్‌కు వెళ్లగా ఇంట్లో కేవలం మృతురాలు గౌరమ్మ, చిన్న కుమారుడు అనిల్ కుమార్ మాత్రమే ఉన్నారని ఏసీపీ వెల్లడించారు.
గురువారం మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు గౌరమ్మ గొంతు కోసి హత్య చేసిన తర్వాత ఇంటి లోపలి తలుపులన్నీ మూసివేసి.. బయట డోరును మాత్రం దగ్గరకు వేసి పరారయ్యారు. భర్త కొమురయ్య ఇంటికి వచ్చి చూసేసరికి గౌరమ్మ పడుకున్నట్లుగా ఉందని.. కానీ దగ్గరకు వెళ్లి చూడగా గొంతు కోసి ఉండటాన్ని గమనించారు. ఆ సమయంలో చిన్న కుమారుడు అనిల్ కుమార్ ఇంట్లో లేకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని ఏసీపీ విజయ్ కుమార్ పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. సిఐ ప్రదీప్ కుమార్.. ఎస్సైలు.. పోలీస్ సిబ్బంది కూడా విచారణలో పాల్గొన్నారు. రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లి వేడుక ఆగిపోయి ఇంటి యజమానురాలు హత్యకు గురవ్వడంతో రామడుగు గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని.. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని ఏసీపీ విజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.