Crime News: కుటుంబంలో నెలకొన్న కలతలు, మానసిక సమస్యలు ఓ ఘోరానికి దారితీశాయి. కన్న తండ్రి అని చూడకుండా.. మతిస్థిమితం లేని వ్యక్తి అని కనికరించకుండా ఓ కుమారుడు తండ్రిని కర్రతో కొట్టి ప్రాణాలు తీసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కలకలం రేపింది.
తుమరవల్లి పంచాయతీ పరిధిలోని నేరాళ్లవలస గ్రామానికి చెందిన పోయిరి సోమయ్య (45) గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తన భార్య చనిపోయినప్పటి నుండి సోమయ్య తీవ్ర దిగ్భ్రాంతికి లోనై.. మతిస్థిమితం కోల్పోయారు. ఈ క్రమంలో ఆయన ప్రవర్తన అదుపు తప్పేది. గ్రామంలోని వ్యక్తులపై తరచూ దాడి చేస్తూ భయాందోళనలకు గురిచేసేవారు. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో సోమయ్య ప్రవర్తన ఇబ్బందికరంగా మారేది.
తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన చిన్న కుమారుడు సింహాచలం, ఈ నేపథ్యంలో సోమయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా.. ఆవేశంలో సింహాచలం తన తండ్రిని కర్రతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన సోమయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. భార్య మరణం తర్వాత ఒంటరితనం, మానసిక వేదనతో సతమతమవుతున్న సోమయ్య చివరకు కన్న కొడుకు చేతిలోనే బలికావడం స్థానికులను కలచివేసింది.
ఈ ఘటనపై మృతుని పెద్ద కుమారుడు పోయిరి ఎరకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తమ్ముడు సింహాచలమే తండ్రిని హతమార్చాడని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఫిర్యాదు మేరకు పాచిపెంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సింహాచలాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. నిందితుడిని నేడు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తికి సరైన చికిత్స అందించాల్సింది పోయి, ఇలా ప్రాణాలు తీయడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Tigers Spotted: ఆదిలాబాద్ జిల్లాలో మూడు పులుల సంచారం.. ఆ గ్రామాల ప్రజలు జాగ్రత్త..