ఏలూరు స్పోర్ట్ అథారిటీ సెంటర్‌లో దారుణంగా
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటన కలకలం సృష్టించింది. శాయ్ భవనంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినిలపై.. శాయ్ ఇంచార్జ్ వినాయక ప్రసాద్ వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు.. అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. విషయం బయటపడింది. వినాయకప్రసాద్ 10 మందికి పైగా బాలికల్ని.. వేధించినట్లు ఫిర్యాదులు అందాయి. ఆటల్లో బాగా ట్రైనింగ్ ఇచ్చి.. యువతను బాధ్యతగా తీర్చిదిద్దాల్సిన గురువు స్థానంలో ఉన్న వ్యక్తే అడ్డదారులు తొక్కాడు.
బాధిత బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోచ్
బాధిత బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏలూరులో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక.. అల్లూరి సీతారామరాజు స్టేడియానికి దగ్గరలో ఉన్న శాయ్ హాస్టల్‌లోనే ఉంటోంది. రెండున్నరేళ్లుగా వెయిట్ లిఫ్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఆమెకు.. శాయ్ ఇంచార్జ్ వినాయక ప్రసాద్ కోచ్‌గా ఉన్నాడు. అతను నెల రోజులుగా తనను వేధిస్తున్నాడని.. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆఫీసుకు పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దాంతో.. వినాయక ప్రసాద్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
నెల రోజులుగా వేధిస్తున్నాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు
ఈ విషయం బయటకొచ్చాక.. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న మరికొందరు బాలికలు కూడా.. లైంగిక వేధింపులకు గురవుతున్నామని.. బెంగళూరులోని శాయ్ సెంట్రల్ ఆఫీసుకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న శాయ్ బృందం.. విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమని నిర్ధారించింది. వారి సూచనల మేరకే.. బాధిత బాలిక కూడా పోలీసులకు కంప్లైంట్ చేసింది. అంతేకాదు.. కోచ్ వినాయక ప్రసాద్ అనేక అవినీతి, అక్రమాలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇంకా ఎవరైనా బాధితులున్నారా? అని ఆరా తీస్తున్నారు.
క్రీడా రంగంలో ఆడపిల్లల భద్రతపై మరోసారి ప్రశ్నలు
ఏలూరు శాయ్ కేంద్రంలో జరిగిన ఈ ఘటన.. క్రీడా రంగంలో ఆడపిల్లల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. శాయ్ అధికారులు.. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఆటలు నేర్పి.. తమను మంచి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే కోచ్‌లను.. విద్యార్థినిలు గురువుగా, మార్గదర్శకుడిగా నమ్ముతారు. వారి భద్రత కూడా కోచ్‌ల బాధ్యతే. అలాంటి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడటం ఘోరమైన నమ్మకద్రోహం. ఇది.. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని.. వారి భవిష్యత్తుని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కోచ్‌లు ఇలాంటి దారుణమైన వేధింపులకు పాల్పడటం.. క్రీడా స్ఫూర్తికే విరుద్ధం. ఇది.. క్రీడా రంగాన్ని అపఖ్యాతి పాలు చేస్తుంది. ఆటల ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకునే ఎంతో మంది అమ్మాయిల విశ్వాసాన్ని.. ఇలాంటి ఘటనలు దెబ్బతీస్తాయి.
కోచ్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు
ఇది.. వారి చదువుపై, ఆటలపై ఉన్న ఆసక్తిపై ప్రభావం చూపి.. వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయ్. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి.. చట్ట ప్రకారం శిక్షించాలి. అప్పుడే.. కోచ్‌ల ముసుగులో ఉన్న కీచకులకు బుద్ధి వస్తుంది. విద్యార్థినిలకు కూడా లైంగిక వేధింపుల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరముందంటున్నారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా, భయం లేకుండా ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు. ముఖ్యంగా.. క్రీడా సంస్థలు, అకాడమీలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థినిలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. పారదర్శకమైన ఫిర్యాదుల విధానాన్ని ఏర్పాటు చేయాలి.