Dead body Parcel :
⦿ డబ్బు వసూలు స్కెచ్
⦿ పశ్చిమ గోదావరి జిల్లా ఘటనలో విస్తుగొల్పే నిజాలు
⦿ మీడియాకు వెల్లడించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ
⦿ డెడ్‌బాడీని చూపించి తులసి నుంచి డబ్బు వసూలుకు ప్లాన్
⦿ ఎవరూ లేని పర్లయ్య అనే వ్యక్తి హత్య
⦿ మద్యం మత్తులో గొంతకు తాడు బిగించిన వైనం
⦿ అన్ని జాగ్రత్తలు తీసుకొని పక్కా కుట్ర
⦿ తులసి నుంచి డబ్బు గుంజే ప్రయత్నం
⦿ డెడ్‌బాడీని సముద్రంలో పడేస్తాడమంటూ నమ్మబలికిన వర్మ
⦿ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
భీమవరం, స్వేచ్ఛ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ డెలివరీ కేసు వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో జరిగిన డెడ్‌బాడీ డెలివరీ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని ఆయన చెప్పారు. ఈ కేసులో శ్రీధర్ వర్మకు, అతడి రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ పాత్ర ఉన్నాయని ఆయన తెలిపారు. డెడ్‌బాడీ చూపించి రేవతి సోదరి తులసి నుంచి డబ్బులు వసూలు చేయాలని ఈ పన్నాగం పన్నారని చెప్పారు.
‘‘సుష్మకి ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయి. శ్రీధర్ వర్మతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. వర్మకు, సుష్మకి ఇద్దరికీ మూడేసి పెళ్లిళ్లు జరిగాయి. తులసికి ఉన్న అవసరాన్ని వర్మ వాడుకున్నాడు. పర్లయ్యను (మృతుడు) భార్య వదిలేసింది. కుటుంబ సభ్యులు ఉన్నా పట్టించుకునే వారులేరు. అందుకే పర్లయ్యను వర్మ తన పథకానికి వాడుకున్నాడు. డెడ్‌బాడీ వచ్చిన రోజు.. వర్మ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తులసి నుంచి డబ్బులు వసూలు చేయాలని ఈ పన్నాగం పన్నారు”.
“తులసి దగ్గర లాగేసిన డబ్బులను రేవతి, వర్మ, సుష్మ పంచుకోవాలని చూశారు. డబ్బులు వచ్చాక శవాన్ని సముద్రంలో పడేస్తామని కుటుంబ సభ్యులను వర్మ నమ్మించాడు. చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ కుట్రకు పన్నాగం పన్నారు. పర్లయ్యను సుష్మకి ఉన్న పొలంలో హత్య చేశారు. మద్యం సేవించిన సమయంలో నైలాన్ తాడుతో మెడకు కట్టి చంపారు. పర్లయ్యకు ముందు మరో వ్యక్తిని చంపాలని వర్మ ప్లాన్ చేశాడు’’ అని అద్నాన్ నయీం అస్మీ వెల్లడించారు.
వర్మకు ముగ్గురు భార్యలు
‘‘రంగరాజు కుమార్తెలు అయిన తులసి,రేవతి మధ్య గొడవలు ఉన్నాయి. రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో పెళ్లి జరిగింది. రేవతి అక్క తులసిని భర్త వదిలేయడంతో ఆమె తన తండ్రి ఇంటికి వచ్చి ఉంటోంది. వీరి తండ్రి రంగరాజుకి 2.50 ఎకరాల పొలం, కొంత స్థలం, బంగారం ఉన్నాయి. ఇక, ఈ కేసులో నిందితుడు శ్రీధర్ వర్మకు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక రెండో భార్య రేవతితో పిల్లలు లేరు. ప్రియురాలు సుష్మతో అతడు సహజీవనం చేస్తున్నాడు.”
‘‘వర్మ చేపల చెరువులు ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడు. చాలా తక్కువ మందితో కాంటాక్ట్‌లో ఉంటున్నాడు. వర్మకు క్రిమినల్ చరిత్ర లేదు. కానీ, మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్నాడు. పర్లయ్య కుటుంబానికి న్యాయం చేస్తాం. ఈ కేసుకు, పర్లయ్యకు సంబంధం లేదు. 100 మంది పోలీసు సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు. జూన్ నుంచి ఈ కుట్ర పన్నారు. వర్మను చేసుకోవడం రేవతి సోదరి తులసికి ఇష్టం లేదు. దాంతో అక్కపై రేవతి కోపం పెంచుకుంది’’ అని ఎస్పీ వివరించారు.
Also Read : డబ్బులు కోసం ఓ కానిస్టేబుల్ వేధింపులు.. ఉరేసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్య
మొత్తంగా పోలీసులనే విస్తుపరిచేలా వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి. హత్య ఘటనపై ఈ నెల 19న సమాచారం అందిందని, వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు వెల్లడించారు. డెడ్‌బాడీ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వివరించారు. అక్కడి నుంచి క్రమంగా అన్ని విషయాల్ని రాబట్టి చివరికి కేసును పూర్తి ఆధారాలతో చేధించినట్లు వెల్లడించారు.