Pranay Murder Case Verdict: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్‌ను దారుణంగా చంపిన A2 సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. మిగిలిన ఆరుగురు దోషులకు జీవిత ఖైదును ఖరారు చేసింది.
అమృత, ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను దారుణంగా చంపాడు.
ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో దోషులందరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృతతో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదవ్వగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు విచారణ సాగింది.
ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ , ఏ-5 కరీం, ఏ-6 శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు.
2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టయిన అమృత తండ్రి మారుతీ రావుకు బెయిల్ దక్కింది. ఏ-1 మారుతీరావు 2020 మార్చి7న హైదరాబాద్ వైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. ఇవాళ తీర్పును వెలువరించింది.
నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు.
కాగా కోర్టు తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు. ప్రణయ్ కేసు తీర్పుతో రెండు కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యారు. ఒకవైపు చనిపోయిన తన కొడుకుని తలచుకుని ప్రణయ్ తల్లిదండ్రులు ఆ కొడుకు సమాధి దగ్గర కన్నీరు కారుస్తున్నారు.
ప్రణయ్ తండ్రి మాట్లాడుతూ.. ప్రణయ్ కేసు విషయంలో నల్గొండలో వచ్చిన తీర్పు.. ఒక నేరస్థులకు కనువిప్పుకలగాలని అన్నారు. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశాం.. ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి. తాము ప్రణయ్ హత్య తర్వాత చాలా కోల్పోయాం అని భావోద్వాగానికి గురయ్యారు. అమృతకు భర్త లేడు.. నాకు కొడుకు లేడు.. నా మనవడికి నానా లేడు అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఈ రకమైన హత్యలకు పాల్పడడం విచారకరం అని.. ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ తీర్పుతో ఇలా జరిగే హత్యలు ఆగిపోవాలన్నారు. మొదటి నుంచి కేసుకు పూర్తిస్థాయిలో సహకరించిన డీఎస్పీ శ్రీనివాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఐదున్నర సంవత్సరాలు కోర్టు తీర్పుకై వేచి చూశాం అని.. ఈ తీర్పుతో తమకు తృప్తినిచ్చిందన్నారు.
వందమంది సాక్షులతో.. 1600 పేజీల చార్జిషీట్‌తో ఎస్పి రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ కేసును చాలా బాగా సోదించారన్నారు. ఈ కేసులో న్యాయవాదిగా వ్యవహరించిన దర్శనం నరసింహ ఎలాంటి ప్రలాభాలకు లోను కాకుండా న్యాయం కోసం పోరాటం చేశాడన్నారు. ఈ తీర్పు మీకు సంతోషాన్ని ఇచ్చిందని చాలామంది అడుగుతున్నారు. నాది సంతోషము కాదు నా బాధ.. నా బాధను ఎవరు తీర్చలేరని ఎమోషనల్ అయ్యారు.
Also Read: ప్రణయ్ కేసు తీర్పు.. ఇది పరువు హత్యే- రంగనాథ్
చంపుకోవడం కరెక్ట్ కాదు తనకు ఎవరి మీద కోపం లేదని.. హత్యలు ఆగాలని సాక్షాలు చెప్పాం అన్నారు. న్యాయస్థానాలు న్యాయవాదుల ద్వారా ఈ దేశంలో చట్టం, న్యాయం అనేది ఉందని రుజువైందని తెలిపారు.
మరోవైపు హత్యకేసులో అమృత బాబయ్ జీవిత ఖైదు పడింది. ఇది తట్టుకోలేక శ్రవణ్ భార్య, పిల్లలు ఆ కోర్టు ఆవరణలోనే పోలీసుల దగ్గర ఏడుస్తూ.. అసలు ఆ శిక్షపడటానికి అమృతే కారణం అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రణయ్ కేసు సమాజానికి గుణపాఠం అంటున్నారు పోలీసులు.