Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాపూర్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రంగారెడ్డి జిల్లా షాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఒక లారీ, ఎదురుగా వస్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాద ధాటికి బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్దులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ ఢీకొట్టిన వేగానికి బైక్ నుజ్జునుజ్జు కాగా, మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యం చూపరులను కలిచివేసింది.
మృతులను కొత్తూరు గ్రామానికి చెందిన సూరజ్, బిక్కిలుగా పోలీసులు గుర్తించారు. వీరు ఇంటర్మీడియట్ విద్యార్థులని, ఈరోజు జరగాల్సిన ఇంటర్ పరీక్షకు హాజరయ్యేందుకు బైకుపై వెళ్తుండగా ఈ దారుణం జరిగిందని ప్రాథమిక సమాచారం. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు పరీక్ష హాలుకు చేరకముందే అనంత లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను గుర్తించే పనిలో పడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read: భర్త కష్టపడితే భార్యకు పోలీస్ జాబ్.. చివరకు భార్య టార్చర్ తట్టుకోలేక భర్త..