Road Accident: కాయగూరలు అమ్ముకుంటున్న రైతులపై మృత్యువులా దూసుకెళ్లింది ఓ లారీ. రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. చేవెళ్ల మండలం ఆర్డర్ గేటు దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- బీజాపూర్ రహదారి పక్కన కొంత మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారి పైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దూసుకొస్తున్న లారీని చూసి.. గమనించిన కొందరు భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపై దూసుకెళ్తూ లారీ చెట్టును ఢీకొంది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి.
Also Read: హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ హత్య.. వెలుగులోకి కొత్త కోణం?
మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటినా ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఇంకేదన్నా కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.