Bengaluru: మంగళకరమైన వేడుకలో విషాదం.. బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రంజిత జీవితం ఎంతో ఉజ్వలంగా సాగుతున్న తరుణంలో ఒక చిన్న నిర్లక్ష్యం ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. గత ఏడాది అక్టోబరులో తన ప్రాణ స్నేహితురాలి నిశ్చితార్థ వేడుక కోసం ఎంతో ఉత్సాహంగా హాజరైన ఆమె, ఆ ఆనంద క్షణాలను గడపకముందే అనంత లోకాలకు వెళ్లిపోయింది. స్నేహితులతో కలిసి బస చేసిన హోమ్ స్టేలో ఫ్రెష్ అప్ అయ్యేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లిన రంజిత, తిరిగి రాని లోకాలకు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు.
అయితే స్నేహితురాలు నిశ్చితార్థం సందర్భంగా ప్రేషప్ కోసం స్నానానికి వెళ్లిన రంజిత ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రాథమికంగా ఇది గుండెపోటు లేదా ఇతర అనారోగ్య సమస్య కావచ్చని అనుమానించినప్పటికీ, అసలు కారణం మాత్రం నాలుగు నెలల తర్వాత వచ్చిన పోస్ట్‌మార్టం నివేదికతో వెలుగులోకి వచ్చింది. ఆ గదిలో నిశ్శబ్దంగా వ్యాపించిన ‘కార్బన్ మోనాక్సైడ్’ ఆమెను ఊపిరి ఆడకుండా చేసిందని తేలింది.
గ్యాస్ గీజర్ వెనుక దాగి ఉన్న ప్రమాదం
సాధారణంగా గ్యాస్ గీజర్లు నీటిని వేడి చేసే క్రమంలో ఆక్సిజన్‌ను వినియోగించుకుంటాయి. అయితే బాత్రూమ్‌లో సరైన వెంటిలేషన్ (గాలి వెలుతురు) లేనప్పుడు, అక్కడ మంట మండటానికి సరిపడా ఆక్సిజన్ అందదు. అప్పుడు ఆ గీజర్ నుండి పాక్షికంగా కాలిన ఇంధనం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ (CO) అనే ప్రమాదకరమైన వాయువు విడుదలవుతుంది. రంజిత బస చేసిన హోమ్ స్టే బాత్‌రూమ్‌లో కనీస వెంటిలేషన్ లేకపోవడంతో, ఆ విషవాయువు కేవలం కొన్ని నిమిషాల్లోనే గదిని నింపేసింది.
సైలెంట్ కిల్లర్ – కార్బన్ మోనాక్సైడ్
ఈ వాయువును ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు, ఎందుకంటే దీనికి రంగు, రుచి, వాసన ఉండవు. అది గాలిలో కలిసినప్పుడు మనం పీలుస్తున్నామన్న విషయం కూడా గ్రహించలేము. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌తో వేగంగా కలిసిపోయి శరీరానికి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. దీనివల్ల బాధితులు ఒక్కసారిగా తల తిరగడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. రంజిత విషయంలో కూడా అదే జరిగింది.. ఆమె కేక వేసే అవకాశం కూడా లేకుండానే విషవాయువు ప్రభావంతో కుప్పకూలిపోయింది.
యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసు చర్యలు
ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపిన పోలీసులు, హోమ్ స్టే యజమాని నిర్లక్ష్యాన్ని ప్రాథమికంగా గుర్తించారు. గ్యాస్ గీజర్లను అమర్చినప్పుడు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను విస్మరించడం, బాత్రూమ్‌లో గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోవడం వంటి లోపాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధ్యతాయుతమైన హోటల్ నిర్వహణ లేకపోవడమే తమ కుమార్తె మరణానికి కారణమని రంజిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక విద్యావంతురాలైన యువతి కేవలం ఒక సాంకేతిక లోపం వల్ల ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
Also Read: గుండెలు పిండేసే ఘటన.. కులాల కారణంగా 2 నెలల చిన్నారి మృతి! అసలేం జరిగిందంటే?
ముందస్తు జాగ్రత్తలే రక్షాకవచం
గ్యాస్ గీజర్లను వాడేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గీజర్‌ను ఎప్పుడూ బాత్రూమ్ లోపల కాకుండా, బయట బాల్కనీలో లేదా గాలి ధారాళంగా ఆడే ప్రదేశంలో అమర్చాలి. ఒకవేళ లోపల ఉంటే, తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. స్నానానికి వెళ్ళే ముందే నీటిని వేడి చేసుకుని, గీజర్ ఆఫ్ చేసిన తర్వాతే లోపలికి వెళ్లడం ఉత్తమం. రంజిత మరణం మనకు నేర్పిన పాఠం ఒక్కటే.. సౌకర్యం కంటే భద్రతే మిన్న!