Crime News : వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయినప్పటి నుంచీ ఇంట్లో గొడవలే. వాళ్లకు ఓ కూతరు కూడా పుట్టింది. అయినా జగడాలు ఆగలే. ఆమె మరో ఇద్దరు మగాళ్లతో అక్రమ సంబంధం సాగిస్తోంది. ఆ విషయం భర్తకు తెలిసింది. అందుకే, ఇంట్లో తరుచూ గొడవలు. కూతురు కోసం భార్యను భరిస్తూ వస్తున్నాడు అతను. కానీ, ఆమె లవర్ పెట్టిన ఓ మెసేజ్‌తో అతను తీవ్రంగా కలత చెందాడు. ఇక బతకలేనంటూ ప్రాణాలు తీసుకున్నాడు. బాధితుడి తండ్రి మాజీ పోలీస్ ఆఫీసర్. కొడుకు ఫోన్ అన్‌లాక్ చేయగా.. అందులోని వీడియోలు, ఛాటింగ్ చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. భార్యను ఆమె భాగస్వామిని అరెస్ట్ చేసి లోపలేశారు. ఇంతకీ అసలేం జరిగింది..? ఆ ఫోన్‌లో ఏముంది..?
భార్య, భర్త.. ఓ ఎఫైర్..
ముంబైలో ఉండే సిద్ధేష్ రత్నే, మానసిలు భార్యాభర్తలు. వారికి రెండేళ్ల కూతురు శ్రీష. సిద్ధేష్ తండ్రి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. చిన్న కుటుంబం. కానీ, చిక్కులు ఎక్కువే. 2020లో సిద్ధేష్, మానసిలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత యువరాజ్ జాదవ్ అనే వ్యక్తితో రంకు సాగిస్తోంది మానసి. కొన్నాళ్లు గుట్టుగా సాగింది ఆ యవ్వారం. ఓ రోజు సిద్ధేష్‌కు దొరికిపోయారు వాళ్లిద్దరూ. అప్పటి నుంచీ ఇంట్లో గొడవలు. రత్నే ఎంతగా కంట్రోల్ చేసుకున్నా.. మానసి మాత్రం రెచ్చిపోయేది. రంకుతో పాటు బొంకు కూడా నేర్చింది. రివర్స్‌లో సిద్ధేష్‌నే టార్చర్ చేయసాగింది. కూతురు కోసం ఎప్పటికప్పుడు రాజీ పడుతూ వచ్చాడు. అయినా, ఆమె వేధింపులు అలానే కొనసాగుతూ ఉండేవి. యువరాజ్ జాదవ్‌తో పాటు మరో వ్యక్తితో కూడా మానసికి ఎఫైర్ ఉందని గుర్తించాడు. సిద్ధేష్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఇక బతకలేనంటూ.. బతికుండి వేస్ట్ అనుకుంటూ.. తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సిద్ధేష్.
ఫోన్‌లో సీక్రెట్స్..
సిద్ధేష్ మరణం విషయం తెలిసి హుటాహుటిన స్వగ్రామం నుంచి ముంబై వచ్చాడు అతని తండ్రి. అసలే పోలీస్. అనుమానంతో కొడుకు ఫోన్ అన్‌లాక్ చేసి చూశాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు సిద్ధేష్. ఓ లెటర్ రాసి దాన్ని ఫోటో తీసి సేవ్ చేశాడు. తన చావుకు భార్య మానసి, ఆమె లవర్ యువరాజ్‌తో పాటు ఆర్తి శివగన్ అనే మూడో వ్యక్తి కూడా కారణమంటూ సూసైడ్ లెటర్ రాశాడు. కుమార్తెను తన పేరెంట్స్‌కు అప్పగించాలని లేఖలో కోరాడు సిద్ధేష్.
Also Read : హైదరాబాద్‌లో కరోనా.. చచ్చాంరా దేవుడా..
ఆ మెసేజ్ వల్లే..
లెటర్‌తో పాటు కొన్ని వాట్సాప్ చాట్‌లు కూడా చెక్ చేశాడు సిద్ధేష్ తండ్రి. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మానసి లవర్ యువరాజ్ జాదవ్.. సిద్ధేష్‌కు పెట్టిన ఓ మెసేజ్ అతన్ని ఉలిక్కిపడేలా చేసింది. “నేను నీ భార్యతో పడుకున్నాను. నువ్వు చనిపో. నేను ఆమెను సంతోషంగా ఉంచుతాను” అంటూ టెక్ట్స్ చేశాడు. యువరాజ్ పంపిన ఆ మెసేజ్‌కే తన కొడుకు చలించిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని.. సిద్ధేష్‌ను సూసైడ్‌కు ప్రేరేపించిన యువరాజ్, మానసిలపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సాక్ష్యంగా కొడుకు సెల్ఫీ వీడియో, వాట్సాప్ చాట్స్, సూసైడ్ లెటర్ ఫోటోను అందించాడు. డిజిటల్ ఎవిడెన్సులు బలంగా ఉండటంతో.. మానసి, యువరాజ్ జాదవ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు ముంబై చునాభట్టి పోలీసులు. దర్యాప్తు కొనసాగుతోంది.