Student Suicide: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఓ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్ లోని శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయిర్ చదువుతున్న కౌశిక్ రాఘవ(17) ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలోనే రాఘవ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు.
Also read: చితిపై శవం శ్వాస తీసుకుంది.. అంతా హడలెత్తిపోయారు.. ఏం జరిగిందంటే
ఘటనపై తల్లిదండ్రలకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే 30 రోజుల క్రితం బాచుపల్లిలోని ఓ ఇంటర్ హాస్టల్ లో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల క్రితం బాచుపల్లిలోని ఇంటర్ బాయ్స్ హాస్టల్ లో 17 ఏళ్ల జశ్వంత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో.. ముప్పై రోజుల వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇంటర్ ఫలితాలు వచ్చిన తరవాతనే కాకుండా ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడంతో తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ర్యాంకుల కోసం, మార్కుల కోసం అటు తల్లి దండ్రులు ఇటు కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకురావడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా తల్లి దండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మానసికంగా కృంగిపోతూ ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులను ఎక్కువగా ఒత్తిడికి గురి చేయవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. కాస్త స్వేచ్ఛ ఇవ్వడంతో పాటూ మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచిస్తున్నారు.