తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. వెల్లియానై సమీపంలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ఇంజినీరింగ్ కాలేజీ బస్సును గూడ్సు రైలు బలంగా ఢీకొట్టింది. ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి కంకర లోడుతో వెళ్తున్న ఈ రైలు.. పట్టాలపై నిలిచిపోయిన బస్సును అమాంతం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 21 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇద్దరిని ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. పరిస్థితి విషమంగా ఉన్న ఒక విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూరు తరలించారు. ఈ ప్రమాద వార్త తెలియగానే ఎంపీ జ్యోతిమణి ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి బాధితులకు భరోసా ఇచ్చారు.
రైల్వే అధికారులు పోలీసులతో కలిసి విచారణ ప్రారంభించారు. కాపలా లేని లెవల్ క్రాసింగ్ వద్ద బస్సు పట్టాలపై ఆగిపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నింపింది. ఈ ఘోర ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.