Tamil Nadu: పాము పగ పట్టింది అనుకున్నారు.. మెుదటి సారి పాము కాటు వేస్తే ఎలాగోలా బ్రతికి బయట పడ్డాడు. మళ్లీ వారానికే పాము కాటుతో అదే వ్యక్తి చనిపోయాడు. దీంతో అందరూ అది పాము పగ పట్టి మళ్లీ కాటు వేసింది అని నమ్మారు. కానీ.. ఓ 15 రోజుల తర్వాత అసలు నిజం బయటపడింది. పగ పట్టింది పాము కాదు కట్టింకి రెప్పలా పెంచిన కొడుకులే అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అప్పులు తీర్చడానికి తండ్రి చంపితే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులను వాడుకోవాలి అనుకున్నారు. మెుదట సారి పాము కాటు వేసిన ఎలాగోలా బయట పడ్డా.. రెండో సారి పకడ్బందీగా వేసిన ప్లాన్ నుంచి తప్పించుకోలేక పోయాడు. పైగా పాము పగపట్టడంతోనే మృతి చెందాడని అందరినీ నమ్మించారు ఇద్దరు కొడుకులు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పొదటూరుపేట గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈపీ గణేషన్ (56)కు ఇద్దరు కుమారులు, మోహన్‌రాజ్ (26), హరిహరణ్ (27). వీరు వ్యాపారాల్లో నష్టపోవడంతో పాటు, బెట్టింగ్‌లకు అలవాటు పడి భారీగా అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చుకోవడానికి తండ్రిని అడ్డుతొలగించుకొని, ఆయన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులను కాజేయాలని పథకం వేశారు. తండ్రి పేరు మీద సుమారు రూ. 3 కోట్ల బీమా చేయించిన కుమారులు, ఆయనను సహజ మరణంగా చిత్రికరించడానికి పాము కాటు ను ఆయుధంగా ఎంచుకున్నారు.
మెుదటి సారి ఇంట్లోకి పామును వదిలారు. పాము కాటు వేసినప్పటికీ.. గణేషన్ అప్రమత్తంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి పక్కా స్కెచ్ వేశారు. రాత్రి సమయంలో తండ్రి నిద్రపోతున్నప్పుడు ఆయన మెడపై పామును వేసి కరిపించారు. ఆసుపత్రికి తరలించడంలో కావాలనే ఆలస్యం చేయడంతో.. గణేషణ్ మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు.
తండ్రి చనిపోయిన వారం రోజుల్లోనే కుమారులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దరఖాస్తు చేయడంతో కంపెనీ అధికారులకు అనుమానం కలిగింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు నార్త్ జోన్ ఐజీ ఆసరా గార్గ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో కుమారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. తండ్రిని చంపడానికి వారే పామును తెచ్చినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.