Travel Agent Fraud: శ్రీలంక పర్యటనకు వెళ్లి ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయిన తెలుగు పర్యాటకుల ఉదంతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కడపకు చెందిన ‘గో టు హాలిడేస్’ (Go To Holidays) సంస్థ ప్రతినిధి ఉదయ్ శంకర్ నమ్మబలికిన మాటలను నమ్మి.. సుమారు 60 మంది పర్యాటకులు శ్రీలంక వెళ్లారు. అయితే.. అక్కడికి చేరుకున్నాక ఏజెంట్ చేతులెత్తేయడంతో వారంతా కొలంబోలో దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు.
ట్రావెల్ ఏజెంట్ ఉదయ్ శంకర్ ఒక్కో పర్యాటకుని నుంచి రూ. 52వేలు వసూలు చేశారు. అంతేకాకుండా స్థానిక ఏర్పాట్ల కోసం అదనంగా మరో రూ.12వేలు తీసుకున్నారు. మొత్తం మీద భారీ మొత్తాన్ని వసూలు చేసిన సదరు ఏజెంట్, పర్యాటకులు కొలంబో చేరుకోగానే పరారయ్యాడు. బస చేయడానికి హోటల్ వసతి లేక, తినడానికి తిండి దొరకక, భాషా సమస్యలతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో మహిళలు, వృద్ధులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.
పర్యాటకులు తమ తిరుగు ప్రయాణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ లో తమ రిటర్న్ టికెట్లు బుక్ అయ్యి ఉన్నాయని.. అయితే ఏజెంట్ వాటిని ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడో అని వారు భయపడుతున్నారు.
ముఖ్యంగా రిటర్న్ టికెట్లు క్యాన్సిల్ కాకుండా చూడాలని పర్యాటకులు కోరుతున్నారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి, తాము క్షేమంగా స్వదేశానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
తమను మోసం చేసిన ‘గో టు హాలిడేస్’ ప్రతినిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
విదేశీ గడ్డపై చిక్కుకున్న తమను ఆదుకోవడానికి భారత రాయబార కార్యాలయం (Embassy) ద్వారా రాయబారం నడిపి, తమను రక్షించాలని బాధితులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నారు.
Also Read: మృత్యువుతో ముఖాముఖి.. ఇద్దరిపై చిరుత దాడి.. భయం నీడలో పల్లెలు