Swimming Tragedy: అసలే వేసవి కాలం.. సెలవుల సమయం. ఉష్ణోగ్రతలు అధికం. ఇకేంముంది స్నేహితులంతా కలిసి సమీపంలోని చెరువులు, కుంటలు, బావుల్లోకి ఈత కొట్టేందుకు వెళుతుండటం సహజం. కానీ సరదా కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోవడమే అత్యంత విషాదకరం. తల్లిదండ్రులు కడుపుకోత మిగల్చడం బాధాకరం. ఏటా వేసవికాలంలోనే అధిక మరణాలు సంభవించడంతో.. కుటుంబాలకు కుటుంబాలు కన్నీటిపర్యంతం అవుతున్నారు. నీటమునిగి మృతిచెందుతున్న వారిలో అధికులు చిన్నారులు, యువతే కావడం.. ఒకే సమయంలో వారంతా ప్రాణాలు కోల్పోవడం అనేక కుటుంబాల్లో తీరని శోకం మిగులుతుంది. మరెందుకు ఇలా.. ఆత సరదా ప్రాణాలు తీస్తున్న అవగాహన లేదెందుకు..? ఒకరిని చూసి మరొకరు ఈతకు వెళుతున్న ప్రమాదకరం అని భావించడం లేదెందుకు..? లోపం ఎక్కడుంది. అవగాహన పెరగాల్సింది తల్లిదండ్రులకా? చిన్నారులకా?
చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి.. ఈత సరదాతో ప్రాణాలు కోల్పోతున్న అభం శుభం తెలియని చిన్నారులు. వేసవికాలంలో ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. విన్న ప్రతిసారి అయ్యో పాపం అనుకుంటాం. ఇంతలోపే.. మరొక ప్రాంతంలో మరొకరు మృతిచెందినట్లు తెలుస్తూనే ఉంది. అదిగో అంతలా చిన్నారుల ప్రాణాలను బలిగొంటుంది ఈత సరదా.. సెలవుల సమయం. స్నేహితులం అలా ఈతకు వెళ్లి వద్దాం అని వెళ్లిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈత వచ్చినా కొందరు మృత్యువాత పడుతుంటే..నేర్చుకుందాం అనుకునే వారిలో మరికొందరు మృతి చెందుతున్నారు.
తాజాగా సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు చిన్నారులు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో.. ఈ ఘటన జరిగింది. ఉపాధి హామీ చెరువులో ఈతకు వెళ్లిన చిన్నారులు.. విగత జీవులుగా తిరిగి రావడంతో మూడు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
మృతుల చిన్నారుల వివరాలు.. గుంట భాను తేజ s/o రాందాసు, గుంట సాయికిరణ్.s/o కమనందన్, కొర్ర సుశాంత్ s/o దన్నేరావు
మరోవైపు అల్లూరి జిల్లా మోతుగూడెం గ్రామంలో మరో విషాదం నెలకొంది. సీలేరు నదికి విహారయాత్రకు వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు కాపాడేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. దేవరపల్లి గ్రామం నుంచి కొంత మంది నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. నీరు తక్కువ ఉండటంతో నదిలోకి ఈతకు దిగారు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నదిలో కొట్టుకుపోయారు. వాళ్లలో నలుగురిని పోలీసులు తాళ్లతో రక్షించారు. మరొక వ్యక్తి గల్లంతయ్యాడు. వారం రోజులు క్రితం ఇదే ప్రదేశంలో చిక్కుకుపోయిన ఐదుగురిని పోలీసులు కాపాడామన్నారు.
Also Read: పెళ్లిలో డీజే డ్యాన్స్ రచ్చ.. వరుడ్ని చంపేశారు, ఎవరి పని?
ఇదిలా ఉంటే.. మేడిగడ్డ బ్యారేజి వద్ద గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుల్లో.. ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని రక్షిత్‌గా గుర్తించారు పోలీసులు. గోదావరి స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు మిస్ అయ్యారు. యువకులు భూపాలపల్లి జిల్లా అంబటిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరి నది ఓడ్డున ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గాలిస్తున్నారు తల్లిదండ్రులు.