Balanagar Road Accident: బండికి నెంబర్ ప్లేట్ ఉంది.. అతడి తలకు హెల్మెట్ కూడా ఉంది.. కానీ ఓ కానిస్టేబుల్‌కు అతడిపై అనుమానం వచ్చింది.. వెంటనే బండిని ఆపాలన్నాడు.. రోడ్డు మధ్యన ఉండటంతో బైక్‌ను పక్కను తీసుకురావాలనుకున్నాడు ఆ బైకర్.. కానీ కానిస్టేబుల్ ఆ చాన్స్ ఇవ్వలేదు.. అతడు డ్రైవ్ చేస్తుండగానే పక్కకి లాగాడు.. ఫలితం.. ఈ సమయానికి ఇంటికెళ్లి కుటుంబంతో గడపాల్సిన ఓ ప్రాణం.. బస్సు టైర్ కింద పడి నుజ్జునుజ్జయ్యింది.. నిర్జీవంగా పడి ఉంది.
ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఓవరాక్షన్.. జోజిబాబు అనే 33 ఏళ్ల వ్యక్తి ప్రాణం తీసింది. బాలానగర్ IDA దగ్గర డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్.. చింతల్ నుంచి బాలానగర్ వెళ్తున్న అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే జోజిబాబును పక్కకు లాగడం.. అతను పడిపోవడం.. అదే సమయంలో వెనక నుంచి ఓ ఆర్టీసీ బస్సు రావడం.. అతడి ప్రాణం పోవడం జరిగిపోయింది.
ఈ ఘటనకు బాధ్యుడైన ట్రాఫిక్ కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి స్థానికులు అతడిని నిలదీశారు. డ్యూటీలో భాగంగానే పోలీసులు వెహికల్స్‌ను ఆపుతున్నారని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మాములు కేసులను ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామో.. అదే తరహాలో ఈ కేసును కూడా విచారిస్తామంటున్నారు. అయితే కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై కూడా విచారణ జరుపుతామంటున్నారు పోలీసులు.
ఇదే సమయంలో పోలీసుల తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. చెకింగ్‌ల సమయంలో కొందరు ట్రాఫిక్ పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటున్నారు. జోజిబాబు కొనసీమ జిల్లాకు చెందినవాడు. హైదరాబాద్ వచ్చి కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. జోజిబాబు మృతిని చూసిన స్థానికులు పోలీసులను నిలదీశారు. కొందరు దేహశుద్ధి చేసేందుకు కూడా రెడీ అయ్యారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. ఏదేమైనా జోజిబాబు పనిచేస్తే కానీ గడవని కుటుంబం. అలాంటి వ్యక్తి.. అకారణంగా చనిపోయాడు. అతని మృతికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు అతని కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు?
Also Read: ట్రంప్ హత్యకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లి దండ్రులను కాల్చి చంపిన 17ఏళ్ల కుర్రాడు
కాగా హైదరాబాద్‌లో వివాదాస్పదమైన జోజిబాబు మృతిపై క్లారిటీ వచ్చింది. ట్రాఫిక్ పోలీసుల తనిఖీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే చనిపోయినట్లు తేల్చారు పోలీసులు. దాంతో అతడి ఫ్యామిలీ ఆందోళన విమరించింది. నిన్న IDPL దగ్గర ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐతే తనిఖీలకు భయపడిన జోజిబాబు, పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో కిందపడిపోయాడు. వెంటనే అతడిపై నుంచి బస్సు వెళ్లిపోవడంతో స్పాట్‌లో చనిపోయాడు. ఐతే ట్రాఫిక్ పోలీస్ కాస్టేబుల్ వల్లే చనిపోయాడంటూ.. ఆందోళన చేశారు. చివరికి ప్రమాదం వల్లే మృతిచెందినట్లు తేలడంతో జోజిబాబు ఫ్యామిలీ వెనక్కి తగ్గింది.