Constables Suicide: ప్రజలకు సమస్య వస్తే అండగా ఉండాల్సిన పోలీస్ డిపార్ట్ మెంట్‌కే సమస్యలు చుట్టుముట్టాయా ? మొన్న వాజేడు.. నిన్న నిజామాబాద్.. నేడు మెదక్.. పోలీసుల వరుస ఆత్మహత్యల వెనుక ఏదైనా మతలబు ఉందా..? మరణమే శరణ్యం అని ఖాకీలు అనుకోవడానికి కారణం ఏంటి ? పనిలో ఒత్తిడి పెరిగిందా ?.. ప్రేమ వ్యవహారమా ? వివాహేతర సంబంధమా ? వేధింపుల వ్యవహారమా..? అప్పుల బాధలా ? కారణం ఏదైనా కానీ ఒక్కొక్కరుగా పోలీసులే ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక మిస్టరీ ఏంటి ? ఇంత జరుగుతున్నా పోలీస్ పెద్దలు నోరు ఎందుకు మెదపడం లేదు ?
తెలంగాణలో కానిస్టేబుల్స్ ఆత్యహత్యలు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డిలో భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురి ఆత్మహత్య ఘటన మరువక ముందే.. తాజాగా ఒకేరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య సంచలనంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లా కొల్చారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే గమనించిన తోటి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సాయికుమార్ మృతికి కొత్త కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. నర్సాపూర్ లో టిఫిన్ సెంటర్ నడిపే వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక నిన్న అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. కామారెడ్డిలో ముగ్గురు పోలీసుల ఆత్మహత్యల ఘటన మరువకముందే మరో చోట కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: షాకింగ్ ట్విస్ట్.. ఆ ముగ్గురి మరణం వెనుక.. నాలుగో వ్యక్తి..?
సిద్ధిపేటలో దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి AR కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగు మందు తాగి ఉరి వేసుకున్న కానిస్టేబుల్ బాలకృష్ణ మృతి చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు విషమిచ్చిన తర్వాత బాలకృష్ణ ఉరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య అని అనుమానిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగుల కారణంగా అప్పులపాలైనట్టు తెలుస్తోంది. సిరిసిల్లలోని 17వ బెటాలియన్ చెందిన AR కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సిరిసిల్లలో ఉంటున్నాడు. భార్యకు నీళ్లలో ఎలుకల మందు, పిల్లల్లకు పాలల్లో పురుగు మందు కలిపి ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక కొద్దిరోజుల క్రితమే ములుగు జిల్లాలో ఎస్సై సూసైడ్ చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో ఈ దారుణం జరిగింది. ఆత్మహత్యకు కారణమైన సూర్యాపేట జిల్లాకు బానోత్ అనసూర్య అనే మహిళని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రేమ పేరుతో వేధింపుల గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసులు వెల్లడించారు. డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్న క్రమంలో అసలు పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది అని డిస్కషన్ నడుస్తోంది.