Hyderabad Fire Accident: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వానలకు పాత ఇళ్లు, భవనాలు కూలిపోతున్నాయి. భారీ వృక్షాలు కూడా నేలకూలుతున్నాయి. అక్కడక్కడ కరెంట్ స్తంబాలు కూడా కూలిపోతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యుత్ వైర్లు తెగిపడుతున్న ఘటనలు కూడా అనేకం చోటు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ఎల్బీ నగర్ సాగర్ రింగు రోడ్డు వద్ద ఓ హృదయ విదారక ఘటన జరిగింది. 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఫుట్‌పాత్‌పై పడుకున్న ఇద్దరు సజీవదహనమయ్యారు. ప్రమాదంలో ఓ వీధి కుక్క కూడా మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాత్రి ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఓ ఆలయం వద్ద ఫుట్‌పాత్‌పై పడుకుని ఉన్న ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉండగానే మంటల్లో కాలిపోయారు.
స్థానికులు వెంటనే పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేసి, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు.
మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విద్యుత్ తీగలు తెగిపడటానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: ఆమెకు 27, అతనికి 53.. వివాహం జరిగిన రెండు వారాలకే వరుడు మృతి
మృతులు భార్యాభర్తలుగా గుర్తించారు. అసలు హైటెన్షన్ వైర్లు ఎలా తెగిపడ్డాయి? ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.