Helicopter crash: ఉత్తరాఖండ్‌లో ఓ హెలికాప్టర్ కూలింది. గుప్త్ కాశి నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గౌరికుండ్-సోన్‌ప్రయాగ్ అడవుల్లో కూలిపోయినట్టు తెలుస్తోంది. స్పాట్‌లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మరొకరు గాయపడ్డారు.
ఘటన సమయంలో పైలట్ సహా ఆరుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. హెలికాఫ్టర్ ఘటన విషయం తెలియగానే NDRF, SDRF బృందాలు ఆ ప్రాంతానికి బయలు దేరాయి. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందినది భావిస్తున్నారు. మృతుల్లో 23 నెలల చిన్నారి కూడా ఉంది. అయితే మృతులు ఎవరు, ఎక్కడివారు అనేదానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ సమాచారం మేరకు.. ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు హెలికాఫ్టర్ బయలుదేరింది. అందులో యూపీ, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన 6 మంది టూరిస్టులు ఉన్నారు. గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాఫ్టర్ టేకాఫ్ అయ్యింది.
కొద్దిదూరం వెళ్లాక అందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనికితోడు వాతావరణం సరిగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లో కుప్పకూలినట్టు చెబుతున్నాయి. హెలికాఫ్టర్ ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ALSO READ: విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల తాత్కాలిక సాయం
చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన పర్యాటకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను ఉపయోగిస్తుంటారు. అక్కడ చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇటీవల ఓ హెలికాఫ్టర్ కూడా అలాగే కూలిపోయింది. ఆ ఘటనలో ఏపీకి చెందిన ఓ ఎంపీ బంధువు చనిపోయారు. ఆ ఘటన నుంచి తేరుకున్న సమయంలో ఆదివారం ఉదయం మరొక హెలికాఫ్టర్ కూలింది.
దీంతో ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవల భద్రతపై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. సాంకేతిక సమస్య, వాతావరణం కారణంగా ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మే 2న కేదార్‌నాథ్ యాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదాల్లో ఇది ఐదోది.