Nizamabad Crime: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టపూర్ శివారులో.. తలలేని మహిళా మృతదేహం లభ్యం అవ్వటం కలకలం రేపుతుంది. మహిళ తల లేకపోవటంతో గుర్తింపు కష్టసాధ్యంగా మారింది. మిస్సింగ్ కేసుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవీపేట బాసర లోని రహదారి మర్డర్ స్పాట్‌గా మారుతుందని.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సుమారు 40 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం పూర్తిగా నగ్నంగా ఉండగా, ఓ చేయి, మరో చేతి వేళ్లు, తల తొలగించి అతి కిరాతకంగా హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ దర్యాప్తు నిర్వహించగా, మృతదేహం పడేసిన ప్రదేశం కొత్తగా తవ్వినట్లు కనిపించిందని తెలిపారు. దాంతో, పోలీసులు ఈ మహిళను ఒకచోట హత్య చేసి.. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మహిళ తల భాగం లేకపోవటంతో గుర్తింపు కష్టంగా మారింది. ఇది చాలా దారుణమైన ఘటన. మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతురాలి వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు.
ప్రాథమిక విచారణలో ఇది మరోచోట హత్య చేసి, నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో పడేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం అన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి అని చెప్పారు.
నవీపేట–బాసర రహదారి ప్రాంతంలో పది రోజుల వ్యవధిలో.. ఇది రెండో మహిళా హత్య కావడం పోలీసులను మరింత అప్రమత్తం చేసింది. ఇటీవలే సమీప ప్రాంతంలో ఒక మహిళ హత్యకు గురైన ఘటనలో దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఈ కొత్త హత్య వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
గత కొద్దిరోజులుగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పరిధిలో.. మిస్సింగ్‌గా నమోదైన మహిళల కేసులను పోలీసులు తిరిగి పరిశీలిస్తున్నారు. ఎవరైనా మహిళ గల్లంతైన ఫిర్యాదు చేసారా అన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు.
నవీపేట మండలం పరిధిలో వరుసగా జరుగుతున్న మహిళా హత్యలతో.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రిపూట ఒంటరిగా వెళ్ళడం మానేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also Read: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా
ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను విశ్లేషిస్తున్నారు. రక్తపు మరకలు, పాదముద్రలు ఆధారంగా చేసుకొని దర్యాప్తు సాగుతోంది.