Murder In Train: రైళ్లలో తరచుగా సీట్ల విషయంలో ప్రయాణీకులు నడుమ గొడవలు జరుగుతుంటాయి. రైళ్లలో కొట్లాటకు సంబంధించిన బోలెడు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సందర్భాలున్నాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన గొడవలు కాసేపట్లోనే సర్ధుమణిగాయి. ఒక్కోసారి రైల్వే అధికారులు జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి. కానీ, తాజాగా ఇద్దరు ప్రయాణీకుల నడుమ సీటు కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి మృతికి కారణం అయ్యింది. చిన్నగా మొదలైన గొడవ ఏకంగా కత్తులు, ఇనుప రాడ్లతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఓ నిండు ప్రాణం పోయింది. ఈ దారుణ ఘటన జమ్మూ నుంచి వారణాసికి వెళ్తున్న రైల్లో జరిగింది.
ఓ యువకుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
యూపీ అమేథీలోని మదేరికన్ కు చెందిన 24 ఏండ్ల తౌహీద్ అంబాలా నుంచి తిరిగి వస్తుండగా, పక్కనే ఉన్న సుల్తాన్ పూర్ జిల్లాలోని గౌతమ్ పూర్ గ్రామానికి చెందిన యువకులతో సీటు విషయంలో గొడవ అయ్యింది. అప్పటికే తౌహీద్ ఓ సీటులో కూర్చోగా, మరో నలుగురు యువకులు వచ్చి అతడు కూర్చున్న సీటులోనే కూర్చునేందుకు ప్రయత్నించారు. సీటులో ఐదుగురికి కూర్చోరాదని తౌహీద్ వారితో గొడవ పడ్డాడు. ఆ గొడవ కాస్త చినికి చినికి గాలి వానగా మారింది. నెమ్మదిగా ఒకరిపై మరొకరు కత్తులు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తౌహీద్ కదులుతున్న రైళ్లోనే చనిపోయాడు. మిగతా యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: కాశ్మీర్ వందే భారత్‌కు ముహూర్తం ఫిక్స్.. టికెట్ ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
నిందితులను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు
జమ్మూ నుంచి వారణాసికి వెళ్తున్న బేగంపురా ఎక్స్ ప్రెస్ రైళ్లో ఈ ఘటన జరిగింది. లక్నో-నిహాల్ గఢ్ స్టేషన్ల మధ్యలో వీరు కొట్లాడుకున్నారు. ప్రయాణీకుడు చనిపోగానే లోకో పైలెట్ రైలును నిలిపివేశాడు. ఈ ఘటనకు సంబంధించిన విషయం తెలియగానే రైల్వే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నిందితులను అదుపుకోలకి తీసుకున్నారు. గాయాపడ్డ వారిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.
Read Also: పాక్‌లో ఆగిన రైళ్లు.. ఆన్‌లైన్ బుకింగ్స్ కూడా బంద్, నరకమంటే ఇదే!
పోలీసులు ఏం చెప్పారంటే?
సీటు విషయంలో జరిగిన గొడవ వ్యక్తి మృతికి కారణం అయినట్లు పోలీసులు తెలిపారు. “మదేరికన్ లో ఉంటున్న 24 ఏళ్ల తౌహిద్ అంబాలా నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. పక్కనే ఉన్న సుల్తాన్‌పూర్ జిల్లాలోని గౌతంపూర్ గ్రామానికి చెందిన యువకులతో వాగ్వాదానికి దిగాడు. వివాదం పెరిగి పెద్దది అయ్యింది. యువకులు తౌహిద్ పై కత్తి, ఇనుప రాడ్ తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి అతడు చనిపోయాడు. నిందితులను అదుపులోకి తీసుకున్నాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టాం” అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.
Read Also: ఆత్మహత్యయత్నం.. అరగంట సేపు ఆగిన రైళ్లు, అతడే బతికించాడు!